-->

ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలకు జలకళ

పొంగిపొర్లుతున్న వాగులు వంకలు
శ్రీరాంసాగర్‌ నుంచి నీటి విడుదల
నిజామాబాద్‌,సెప్టెంబర్‌28 (జనంసాక్షి) : ఉమ్మడి జిల్లాలో మరోమారు భారీ వర్షాలు కురిశాయి. దీంతో జలాశయాలు, చెరువులు, కుంటలు నిండాయి. భూగర్భజలాలు కూడా పెరిగాయని అధికారులు అంటున్నారు. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, నైరుతి ఋతుపవనాల ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. అన్ని మండలాల పరిధిలో భారీ వర్షం కురిసింది. పలు గ్రామాల పరిధిలో చెరువులు అలుగులు పారగా వాగులు పొంగాయి. జిల్లాతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్రలో వర్షాలు పడడంతో గోదావరి, మంజీరాకు వరద పోటెత్తింది. మహారాష్ట్ర వర్షాలతో పాటు ప్రాజెక్టు క్యాచ్‌మెంట్‌ ఏరియాలో పడుతున్న వర్షాలతో భారీగా వరద వచ్చి చేరుతోంది.ప్రధాన జలాశయం శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోనికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్‌ 33 గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. అలాగే 10 వేల క్యూసెక్కుల నీటిని వరద కాల్వ ద్వారా కింది భాగానికి వదులుతున్నారు. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1090 అడుగులుగా నమోదు అయ్యింది.
గోదావరి, మంజీరాలో నుంచి భారీ వరద రావడంతో ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ఎప్పటి కప్పుడు వరదను సవిూక్షిస్తూ నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. ఎస్సారెస్పీకి ప్రస్తుతం రెండు లక్షల 80వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, 32 గేట్ల ద్వారా రెండు లక్షల 74వేల 890 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాపై గులాబ్‌తుపాన్‌ ప్రభావం చూపింది. వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నిజాంసాగర్‌, కౌలాస్‌ నాలా ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద వచ్చి చేరు తోంది. భారీ వర్షాలకు కామారెడ్డి మండలంలోని లింగాయిపల్లి మొండివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కామారెడ్డి నుంచి రాజంపేట వెళ్లే రోడ్డు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. మాచారెడ్డి మండలం వాడి, పరిధిపేట గ్రామాల మధ్య లోట్టివాగు జోరుగా ప్రవహిస్తుండడంతో ఇరుగ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మంజీరా నది వెంట వారం రోజులుగా వరద నీరు ఉధృతి తగ్గడం లేదు. ఎగువ ప్రాంతం నుంచి నిజాంసాగర్‌లోకి భారీ వరద నీరు వస్తుండటంతో నీటి పారుదల శాఖాధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యాన్ని 1405 అడుగులకు గాను
1404 అడుగుల నీటి సామర్థ్యాన్ని నిల్వ చేస్తూ ఎగువ నుంచి వచ్చే నీటిని దిగువకు వదులుతున్నారు. సింగూరు నుంచి 34 వేల క్యూసెక్కుల వరద నీటిని మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నారు. సింగూరు వరద నీరు నేరుగా నిజాంసాగర్‌లోకి వచ్చి చేరుతోంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టు పర్యాటకులతో కిటకిటలాడిరది.
సింగూరు ప్రాజెక్టు ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురియడంతో మంజీరా నదిలోకి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నిజాంసాగర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ సింగూరు ప్రాజెక్టు 4 గేట్లను ఎత్తి నీటిని నిజాంసాగర్‌ దిగువకు విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిండి దాదాపు నెల రోజులు గడిచిపోయింది. కానీ, కురుస్తున్న భారీ వర్షాలకు పోచారం ప్రాజెక్టు, సింగూరు, హల్దివాగుల ద్వారా భారీ వరద నీరు వస్తుండటంతో పక్షం రోజులుగా నిజాంసాగర్‌ వరద గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులు తున్నారు. సింగూరు ప్రాజెక్టులోకి ఒకేసారిగా భారీ వరద నీరు రావడంతో నీటి పారుదల శాఖాధికారులు నిజాంసాగర్‌లోకి వరద నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టాన్ని నిల్వ చేస్తున్నట్లు సింగూరు ప్రాజెక్టు నిర్వహణాధికారులు తెలిపారు. ఉభయ జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, సంగా రెడ్డి, మెదక్‌, జిల్లాల నుంచి పర్యాటకులు తండోప తండాలుగా రావడంతో ప్రాజెక్టు వరద గేట్ల కట్టపైన పర్యాటకులతో కిటకిటలాడిరది. నిజాంసాగర్‌ మంజీరా నది నల్లవాగు మత్తడి బ్యాక్‌ వాటర్‌తో నాగమడుగు నీట మునిగి పోవడంతో అచ్చంపేట, తదితర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గత కొన్ని రోజులుగా వరుసగా వర్షాలు కురుస్తుండటంతో మంజీర ప్రాజెక్టు నిండుకుండలా మారింది. నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు ప్రాజెక్టులోకి ఉధృతంగా వస్తుండటంతో ప్రాజెక్టు అధికారులు గేట్లను ఎత్తివేసి నీటిని మంజీరాలోకి వదిలారు. దీంతో మంజీరా నది నిండుగా వరద నీటితో పారుతుంది. ఇదిలా ఉండగా.. ఇసుక క్వారీల కోసం ఏర్పాటు చేసిన ర్యాంపులు సైతం వరద నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో క్వారీలలో ఇసుక తవ్వకాలు నిలిపివేశారు. మంజీరా నది వైపు ఎవ్వరు వెళ్లకూడదని అధికారులు ప్రజలకు తెలిపారు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో మండలంలోని మంజీరా నది పరివాహక ప్రాంత గ్రామాల్లో నిజాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌తో వరి పంటలు నీట మునుగుతున్నాయి. బ్యాక్‌ వాటర్‌ భారీగా వచ్చి పంటలు నీట మునగడంతో అన్నదాతలకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుందని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.