ఎన్నికలు వస్తే పథకాలు గుర్తుకు వస్తాయి
కెసిఆర్‌పై మండిపడ్డ మాజీమంత్రి షబ్బీర్ అలీ
కామారెడ్డి,ఆగస్ట్24(జనంసాక్షి): ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్‌కు పథకాలు గుర్తుకు వస్తాయని, దళితబంధు పేరుతో దళితులను మభ్యపెడుతున్నాడని మాజీమంత్రి , కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. తెలంగాణాకు కాపల కుక్కలా ఉంటానని, దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని, మూడు ఎకరాల భూమి ఇస్తానని ఇచ్చిన హావిూ ఏమయ్యిందన్నారు. వీటిలో ఏ ఒక్కటైన నెరవేరిందా అని ప్రశ్నించారు. ఉద్యోగులకు సమయానికి జీతాలు రాక అల్లాడుతున్నారని, ఏ ఒక్క పథకంలో సమయానికి డబ్బులు చెల్లిస్తున్నారా అని అన్నారు. దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేవలం హుజూరాబాద్‌లోనే దళితబంధును అమలు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో మిగితా నియోజకవర్గాల్లో దళితులు కనబడటం లేదా? అని పశ్నించారు. ఉపఎన్నికలో విజయం సాధించేందుకు హుజూరాబాద్‌ను పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారని ఎద్దేవా చేశారు. వెంటనే రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధును అమలు చేయాలని, లేనియెడల ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.