ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా
నిజామాబాద్,ఆగస్టు 21(జనంసాక్షి): మైనార్టీ జూనియర్ కళాశాల లెక్చరర్ పోస్టులకు చేసిన వారందరికీ అవకాశం ఇవ్వాలని అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏఐఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో ఉన్న మైనార్టీ జూనియర్ కళాశాలలో సుమారు 80 లెక్చరర్ పోస్టులు కోసం ఈనెల మొదటి వారంలో సంబంధిత మైనార్టీ వెల్ఫేర్ కార్యాలయంలో లెక్చరర్ పోస్టులు కోసం టీపీటీ, బీ.ఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు సుమారు 800 మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో నుండి ఇంటర్మీడియట్ క్లాసులు బోధించే వారికే అర్హులుగా గుర్తించి హాల్ టికెట్లు ఇవ్వడం శోచనీయమన్నారు. తెలుగు పండిట్‌లు మరియు డిగ్రీ వారికి క్లాసులు చెప్పే లెక్చరర్లు ఎందుకు ఈ పరీక్షకు అర్హులు కారో సంబంధిత అధికారులు తెలియజేయాలన్నారు.నేడు వీరు సమస్యలు పరిష్కరించాలని మైనార్టీ వెల్ఫేర్ బోర్డ్ డీఎండబ్ల్యూ రమేష్ స్పందించకపోవడంతో కాళీ కుర్చీకి సమస్యలతో కూడిన వినతిపత్రం సమర్పించారు. అనంతరం అభ్యర్థులతో జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్‌ను కలిశారు. అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ స్పందిస్తూ డీఎండబ్ల్యు రమేష్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ నెల 23న జరిగే మైనార్టీ జూనియర్ కళాశాల లెక్చరర్ పోస్టులకు టీపీటీ, బీఈడీ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నష్టపోకుండా చూడాలని, అందరూ ఈ పరీక్ష రాయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ సహాయ కార్యదర్శి వంశీ, నాయకులు జీవన్, కళ్యాణ్, పరీక్ష సంబంధించిన అభ్యర్థులు పాల్గొన్నారు.