కవ్వింపు చర్యలకు పాల్పడితే ఖబాదర్‌

గిట్లయితే తెలంగాణలో ఒక్క సీమాంధ్ర లారీని కూడా తిరుగనియ్యం
మీ లారీలతో మా రోడ్లు కూడా నాశనమైతున్నయ్‌
తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే నానిపై టీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు నిప్పులు
సిద్దిపేట దగ్గర సీమాంధ్ర లారీలను ఆపి నిరసన
మర్యాదగా మా లారీలను వదిలెయ్యాలె
ప్రభుత్వం నానిపై కేసు పెట్టాలని డిమాండ్‌
సిద్దిపేట, ఆగస్టు 5 (జనంసాక్షి) : ‘బిడ్డా మా సహనానికి కూడా ఓ హద్దుంటది.. కవ్వింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదు’ అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఆళ్ల నానిపై మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్‌కు చెందిన గ్రానైట్‌ లారీలను ఆంధ్ర తాడేపల్లిగూడెం వద్ద స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల నాని, ఆర్డీఓ అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్రులు కండకావరంతోనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రోడ్లు పాడైతున్నాయనే లారీలను అడ్డుకున్నామని ఎమ్మెల్యే నాని కుంటి సాకులు చెబుతున్నాడని విమర్శించారు. సీమాంధ్రుల వల్ల తెలంగాణ ప్రజలే బుగ్గిపాలయ్యాయని, వాళ్లు తెలంగాణలో పెట్టిన క్వారీలు, అక్కడి రాళ్లను తరలించడానికి వస్తున్న సీమాంధ్ర లారీల వల్ల తెలంగాణ బతుకులు రోడ్లకు పడ్డగతుకుల వల్ల తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి గాను హరీశ్‌రావు సిద్దిపేట మీదుగా ఆంధ్రకు వెళ్తున్న సీమాంధ్ర లారీలను రంగధాంపల్లి గ్రామం వద్ద అడ్డుకుని నిరసన తెలిపారు. ఆయనకు మద్దతుగా కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, జమ్మికుంట ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌ నిరసన ప్రదేశానికి చేరుకుని హరీశ్‌రావుతో జతకలిశారు. అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ తెలంగాణ లారీలు ఆంధ్రలో తిరిగితే అక్కడి రోడ్లు పాడైతయి గానీ, అక్కడి లారీలు ఇక్కడ తిరిగితే మా రోడ్లు చెడిపోవా అని నానిని ప్రశ్నించారు. అసలు ఏ అధికారంతో ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలంగాణ లారీలను అడ్డుకొన్నాడో చెప్పాలన్నారు. అక్రమంగా లారీలను అడ్డుకొన్నందుకు ఆయనపై కేసును నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. అసలు తెలంగాణ నుంచి వెళ్తోన్న లారీల్లో ఉన్నది ఆంధ్రోళ్ల గ్రానైట్‌ రాయేనన్నారు. తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్‌లోని క్వారీల్లో ఎక్కువ శాతం ఆంధ్రోళ్లవేే ఉన్నాయని వెల్లడించారు. వెంటనే తెలంగాణ లారీలను వెంటనే విడిచిపెట్టాలని, లేదంటే సీమాంధ్ర లారీలను తెలంగాణలోని పది జిల్లాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. అదే విధంగా, తెలంగాణలో ఉన్న సీమాంధ్ర క్వారీలను మూసివేయిస్తామని ఎమ్మెల్యేలు ఆల్టిమేటం ఇచ్చారు. ప్రభుత్వం ఎమ్మెల్యే నానిపై కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు. మర్యాదగా తెలంగాణ లారీలను విడిచి పెట్టకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హరీశ్‌రావు నాయకత్వంలో ఎమ్మెల్యేలు హెచ్చరించారు.