కాంగ్రెస్ లాగా హావిూలివ్వడం తెలియదు
చేసిందే చెబుతారు..చెప్పిందే చేస్తారు: గంగుల
కరీంనగర్,సెప్టెంబర్22 జనం సాక్షి: ఎం కేసీఆర్ చేసేది చెప్తారు.. చెప్పింది చేస్తారని, కాంగ్రెస్ లాగా కల్లబొల్లి కబుర్లు చెప్పరని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎన్నికలు వస్తున్నాయి.. కాంగ్రెస్ పార్టీ బోగస్ హావిూలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు చూస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో కర్ఫ్యూలు, కరెంట్ కోతలు తప్ప ఏముండేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ మాయమాటలను నమ్మితే మళ్లీ గోసపడుడేనని హెచ్చరించారు. కేసీఆర్‌తోనే తెలంగాణకు శ్రీరామరక్ష , ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు.ప్రజలకు ఇచ్చిన హావిూలను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని అన్నారు. ఆయన చేసేదే చెప్తారని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా చెప్పింది తప్పకుండా చేస్తారని స్పష్టం చేశారు. తెలంగాణలో అలవికాని హావిూలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. మండలంలోని డబుల్ ఇండ్లు నిర్మించి పైరవీలకు తావు లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. సొంత జాగా ఉన్న వారికి గృహలక్ష్మి పథకం కింద రూ. 3లక్షల చొప్పున ఆర్థికసాయం మంజూరు చేస్తామన్నారు. కేసీఆర్ పాలనలో పేదవారికే ప్రాధాన్యత తప్ప, పైరవీలకు ఏమాత్రం అవకాశం ఉండదని మంత్రి స్పష్టం చేశారు. మలివిడుత ఉద్యమం సందర్భంగా ఎంతో బలవంతులైన తెలంగాణ వ్యతిరేక శక్తులను ఎదుర్కొని కేసీఆర్ ప్రత్యేక రాష్టాన్న్రి సాధించి ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని గుర్తుచేశారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్న ధ్యేయంతో ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలను అందజేస్తున్నారని తెలిపారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెరవకుండా సీఎం కేసీఆర్ అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్సారెస్పీ రివర్స్ పంపింగ్ ఇందుకు నిదర్శనమని అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, పింఛన్లు, కల్యాణలక్ష్మి తదితర పథకాలు సంక్షేమ పాలనకు అద్దం పడుతున్నాయన్నారు.