తాగి వాహనం నడిపితే తాట తీసేందుకు రెడీ

drink-driving

తాగి వాహనం నడిపితే తాట తీసేందుకు రెడీ

మద్యం తాగి బండి నడిపే వారికి చుక్కలు చూపించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్‌ కేస్‌లో పట్టుబడితో ఆల్‌మోస్ట్ కెరీర్‌కు పుల్‌ స్టాప్ పడ్డట్టే. పాస్‌పోర్టు రాదు. వచ్చిన పాస్‌పోర్టు మీద వీసా రాదు. విద్యార్థులకు కొత్తగా కాలేజీల్లో సీట్లు ఇవ్వరు. ఉద్యోగులైతే వ్యక్తిగత రిమార్కుల్లోకి చేరిపోతుంది. నిరుద్యోగులైతే రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు బ్లాక్‌లో పెడుతాయి. డ్రైవింగ్ లైసెన్స్‌పై శాశ్వత నిషేధం విధిస్తారు. నూతన వాహనాల రిజిస్ట్రేషన్ చేయరు. ఉన్న వాహనాల ఆర్సీలను రెన్యూవల్ చేయరు. పైండ్లెన వాళ్లకు మరో చిక్కు. తాగి పట్టుబడితే పోలీసుల వద్దకు భార్యతో సహా వచ్చి ఆవిడ ముందు కౌన్సెలింగ్ తీసుకోవాలి.
ఒక వేళ మైనర్లకు బండి ఇస్తే సదరు బండి యజమాని మీద కేసులు పెడతారు. మద్యం మత్తులో ప్రమాదాలకు పాల్పడితే ఐపీసీ 304 పార్ట్ 11 సెక్షన్ కింద కేసులు నమోదు చేయనున్నారు. పదేండ్ల వరకు శిక్ష పడుతుంది. గతంలో డ్రైవర్ తాగిందీ లేనిదీ తెలుసుకునేందుకు వైద్యశాలలకు పంపితే కేసులు తారుమారయ్యేవి. ఇపుడా పద్ధతి మార్చేశారు. బ్రీత్ ఎనలైజర్లతో సంఘటన స్థలంలోనే తేల్చేస్తారు. ఈ వ్యవహారం మొత్తాన్ని వీడియా తీయించి సాక్ష్యంగా కోర్టుకు సమర్పిస్తారు. మొత్తంగా మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాల నివారణ మీద, డ్రంకన్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్‌ల మీద హైదరాబాద్ నగర పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
మద్యం తాగి మైనర్ చేసిన ప్రమాదం, బాధిత కుటుంబాన్నే కాదు రాష్ట్ర ప్రజలను కుదిపేసింది. 21 ఏండ్లకు పైబడిన వారికే మద్యం అమ్మాలని నిబంధనలున్నా పట్టించుకోకుండా ఓ బార్ విచ్చలవిడిగా లిక్కర్ అమ్మటం..పగటి పూటే పీకల దాకా తాగి ఇష్టారాజ్యంగా కారు నడపటం చివరికి ఓ కుటుంబాన్ని కోలుకోకుండా చేసింది. ఈ విషాదానికి మైనర్ ఒకడే కారణం కాదు. మద్యం అమ్మిన వాడినుంచి.. మైనర్లకు బండ్లు ఇస్తున్న తల్లిదండ్రుల దాకా అనేక మంది బాధ్యులు. రమ్య ప్రమాద ఘటనతో పోలీసులు ఇలాంటి ఘటనల మీద ఇకపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉన్న చట్టాలకు మరింత పదును పెట్టి ఈ ఘటనలు పునరావృతం కానివ్వవద్దని దృఢనిశ్చయానికి వచ్చారు.
ఇక నుంచి మద్యం తాగి రోడ్డు ప్రమాదం చేసి, ఇతరుల మరణానికి కారణయితే 304 పార్టు 2 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. 21 సంవత్సరాల లోపు వారు మత్తులో రోడ్డు ప్రమాదాలు చేసినా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతూ ప్రమాదాలకు కారణమైనా కఠినమైన సెక్షన్లు విధించనున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడే కేసుల్లో వారి భార్య, తల్లిదండ్రులను కూడా కౌన్సిలింగ్‌కు పిలువనున్నారు. ఇక ఇప్పటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే రెండు మూడు రోజులు జైలు కెళ్లివచ్చే వారు. అలాగే మైనర్లు, డ్రైవర్లకు మద్యం సరఫరా చేసే దుకాణాలపై కూడా కొరడా ఝళిపించనున్నారు.
డ్రంక్ అండ్‌ డ్రైవ్, ర్యాష్‌ డ్రైవింగ్‌కు సంబంధించి పోలీసులు ప్రతి కేసును డాటాబేస్ రూపంలో భద్ర పరుస్తారు. పట్టుబడ్డ వారి వివరాలను ఆయా విభాగాలకు పంపించడం, లేదంటే ట్రాఫిక్ విభాగం డాటాబేస్‌ను షేర్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. ఫలితంగా పాస్‌ పోర్ట్, వీసా జారీ కాదు. ఆల్రెడీ పాస్ పోర్టు ఉంటే దాన్ని రద్దు చేస్తారు. మైనర్లకు స్కూళ్లు, కాలేజీల్లో నో అడ్మిషన్స్. అందుకే ఇకపై తాగి వాహనాలు నడిపేవారు భారీ మూల్యం చెల్లించక తప్పదు.