తెలంగాణకు భయపడేబాబు మహానాడు రద్దు చేసిండు !

టీ టీడీపీ దుకాణం ఎత్తేసుకోండి

హైదరాబాద్‌్‌, జూలై 9 (జనంసాక్షి) : తెలంగాణపై తమ నిర్ణయం ప్రకటించాల్సి వస్తుందని భయపడి టీడీపీ అధినేత తమ పార్టీ అధికారిక కార్యక్రమం మహానాడును రద్దు చేశారని తెలంగాణ నగారా అధ్యక్షుడు నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణపై ఎక్కడ అభిప్రాయాన్ని తెలుపాలని ప్రజలు డిమాండ్‌ చేస్తారోనన్న భయానికి మహానాడు రద్దు చేసుకున్నట్లే, తెలంగాణ ప్రజలకు ఏమాత్రం ఉపయోగంలేని, తమ పార్టీ ఏర్పాటు చేసిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫోరంను కూడా రద్దు చేసుకుంటే బాగుంటుందని నాగం ఎద్దేవా చేశారు. చంద్రబాబు లాగే టీటీడీపీ ఫోరంలోనూ ఒక్కరికి కూడా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు. అసలు తెలంగాణ ప్రజలు టీటీడీపీ ఫోరాన్ని ఎప్పుడో మరిచిపోయారని తెలిపారు. ఆ ఫోరం తెలంగాణలో తిరిగితే ప్రజలు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికైనా తెలంగాణ టీడీపీ నాయకులు ఆ సమైక్యపార్టీని వీడి ప్రత్యక్ష ఉద్యమంలోకి రావాలని నాగం హితవు పలికారు.