తెలంగాణ మంత్రులు మాట్లాడరెందుకు…..?

తెలంగాణ వనరులను దశాబ్దాల పాటు కొల్లగొట్టినా సీమాంధ్ర పాలకుల దాహం తీరినట్లులేదు. నాగార్జునసాగర్‌లో నీరు డెడ్‌ స్టోరేజీకి చేరినా తెలంగాణ ప్రజలకు తాగునీరు లభించే పరిస్థితి లేకున్నా సీమాంధ్ర పాలకులు వర్ఫాభావ పరిస్థితులు సాకుగా చూపిస్తూ కృష్ణా డెల్టాకు సాగర్‌ జలాలు విడుదలకు పూనుకుంది. ఓవైపు తెలంగాణలోని నల్లగొండ, పాలమూరు, రంగారెడ్డి లతో పాటు రాజధాని ప్రజల గొంతెండుతున్నా పట్టించుకోలేదు. సీమాంధ్ర పాలనలో తెలంగాణ వనరుల దోపిడీకి ఇది ప్రత్యక్ష తార్కాణం. సమైక్యాంధ్ర అంటూ గొంతుచించుకొనే సీమాంధ్ర నాయకులు ఈ దోపిడీకి ఏమని సమాధానం చెప్పగలరు.? అంధ్రా పాలకుల దోపిడీకి ప్రత్యక్ష సాక్షాలు తెలంగాణలోని ఏప్రాంతాన్ని వెదికినా కనిపిస్తాయి. నాగార్జునసాగర్‌లో స్వల్ప పరిమాణంలో నీరు ఉన్నప్పటికీ నల్గొండ,మహబూబ్‌నగర్‌ జిల్లాల ప్రజలతో పాటు, రాజధాని ప్రజల ఆందోళనలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నీటి విడుదలకు పూనుకుంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా నల్గొండ జిల్లాలో సాగర్‌ జలాల దోపిడీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా అధికార,విపక్షాలు అన్నీ కలిసికట్టుగా ప్రజాందోళనకు మధ్దతు తెలిపాయి. దీంతో కంగుతిన్న సీమాంధ్ర పాలకులు దొంగల్లా రాత్రి పూట నీటిని తరలిస్తూ తమ నైజాన్ని బయట పెట్టుకున్నారు. సమైక్యాంధ్రకే మా మద్ధతు అన్న సీపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు సైతం నీటి విడుదలను వ్యతిరేకిస్తూ సీఎంకు లేఖ రాశారు. అయితే ఇక్కడ తెలంగాణ ప్రజలు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంత జరిగినా తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు నీటివిడుదలను వ్యతిరేకిస్తూ ఒక్క మాటకూడా మాట్లాడకపోవడం శోచనీయం. సీమాంధ్ర నేతల మోచేతి నీళ్లు తాగుతూ వారి చెప్పిన దానికల్లా తలలూపడం భాదాకరం. సాక్షాత్తు ఆపార్టీకి చెందిన తెలంగాణ సీనియర్‌ నేత పాల్వాయి గోవర్దన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ మంత్రులు సీఎం భజన మానండంటూ సూచించడం పరిస్థితికి అద్దం పడ్తుంది. కృష్ణా జలాలపై తమకు హక్కుందంటూ ఆంధ్రా నాయకులు తెలంగాణ వారి బెదిరింపులకు భయపడి నీటివిడుదల మానుకోవద్దంటూ హెచ్చరించడం వారి దోపిడీకి నిదర్శనం. సాగర్‌ నుంచి నీటి విడుదలను స్వాగతించిన సీమ నాయకులు తెలంగాణ గొంతెండుతన్నప్పటికీ శ్రీశైలం నుండి సాగర్‌కు నీటిని విడుదల చేయవద్దనడం వారి రెండు నాల్కల ధోరణికి తార్కాణం. శ్రీశైలం నుండి నీటిని విడుదల చేస్తే భవిష్యత్తులో సీమ ప్రజల తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయన్న సీమ నాయకులు తెలంగాణ ప్రజల గొంతెండుతున్నా పట్టించుకోరేం? అయీతే మనం ఇక్కడ తప్పుపట్టవలసింది వారి దోపీడీని మాత్రమే కాదు, సీమాంధ్ర నాయకుల వలె తమ ప్రాంతానికి అన్యాయం ఎదురైతే ప్రశ్నించని తెలంగాణ మంత్రుల చేతగానితనాన్ని కూడా. ఏం ప్రశ్నిస్తేసే పదవులు పోతాయా? ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం నడుస్తున్న ఈ సమయంలో కూడా పదవుల కోసం పాకులాడుతున్న వారిని ఏమనాలి? ఇప్పటికైనా తెలంగాణ మంత్రులు సీమాంధ్ర నాయకులు చెక్కభజన మాని కృష్ణా జలాల దోపిడీపై గొంతెత్తాలి. పోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్లు తప్ప అన్న సూక్తి మనకు ఆదర్శం కావాలి. తెలంగాణ మంత్రులు తెలంగాణ సమస్యలపై గళమెత్తితే ఇక్కడి ప్రజల దృష్టిలో హీరోలవుతారు. ఇప్పటికైనా వారి మనసు మారి తెలంగాణ సమస్యలపై పోరాడాలి. వారిలో ఈ మార్పును తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.