దళితులకు భూమి దున్నే హక్కు లేదా?

నాడు కారం చేడు, చుండూరు, ఖైర్లాంజి, నేడు శ్రీకాకుళం లక్ష్మీపేట! దళితులపై ఊచకోత, ఐదుగురు బలి. వార్తా పత్రికలకు, టీవి చానళ్ళకు అంతగా రుచించని అంశం. అరవై సంవత్సరాలు పైబడిన భారతదేశ స్వాతంత్రం మింగుడు పడని ప్రశ్నలను అట్లనే మిగిల్చింది. అడవులలో జీవితాలను వెళ్లదీస్తున్న ఆదివాసీలకు ఈ జెండాల పండగ అంటే ఏందో, ప్రణబ్‌ ముఖర్జీనే ఎందుకు రాష్ట్రపతి కావాలో, ప్రజలను, వనరులను దోపిడీ చేసే వాడు నాయకుడు ఎట్లా అయితాడో, ఎన్నడు ప్రజా సమస్యలు పట్టించుకోని ఎంపీలు జైళ్ళలోకి వెళ్లి కూడా ఫలానా వారికే మద్దతు పలకండి అని ఎందుకు బతిమిలాడుతారో రోజు కాలి నాలి చేసుకుని బతికే ఎల్లయ్యలకు, మల్లయ్యలకు, అక్క లచ్చిమికి, చెల్లి మంగకి అర్థం కాదు. అతి పెద్ద రాజ్యాగం ప్రజలందరి కుల, మత, లింగ భేదాలు లేకుండా ఈ దేశ అభివృద్ధి ఫలాలు అందరి కోసం అని రాసుకున్న రాజ్యాంగం కొందరికి మాత్రమే దక్కిన పండు అయింది. ఇవ్వాళ బడుగు జీవులు, అంటరాని కులాలు అనబడే దళితులూ ప్రభుత్వ భూమి దున్నుకున్నందుకు బలి అయినారు. అదే శ్రీకాకుళంలోని లక్షింపేటలో.
శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలో మడ్డువలస ప్రాజెక్టు కోసం పాత లక్షింపేటలో భూములను సేకరించినరు ప్రభుత్వం వారు. అందరికి నష్ట పరిహారం అందింది, ఒక్క దళితులకి
తప్ప. ఎప్పటిలాగానే రెండు, మూడు వేలు. ఈ దేశంలో వీరికి మాత్రమే విచిత్రమైన లెక్ఖలు ఉంటాయి చట్టంలో. భారత దేశంలో ఏ ప్రాజెక్టులోనైనా కాస్త పలుకుబడి, తమ కులస్తులు రాజకీయాల్లో ఉంటె వారికి ఎన్నడు అన్యాయం జరుగదు. దళితులకు మాత్రం తమ కులస్తులు మంత్రి పదవులో ఉన్నా కూడా వారికి జరిగేది శూన్యం. అక్కడ కొండ్రు మురళి, మాల వాడే, మాల వాళ్లకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఏమి చేయలేక, అందరిలాగానే నోరు మూసుకోండి, కాపులతో పెట్టుకోకండి అని ఉచిత సలహాలు ఇచ్చేవాడు అట. ఇక బొత్స కుటుంబ వారసత్వం అంటా ఆ ప్రాంతంలోనే ఉంది. వారు కాపు కులస్తులు, కమ్మ బలిస్తే కాపు అన్న సామెతకి ఏ మాత్రం తీసుపోకుండా వారు మసలుకున్తుంటారు. ప్రాజెక్టు పక్కన మిగిలిఉన్న అరవై ఎకరాలను దళితులూ పన్నెండు ఏండ్లగా సాగు చేసుకుంటున్నారు. పునరావాసం క్రింద కాపులను, మాలలను ఒక్క దగ్గరికి చేర్చినారు, దళితవాడ తమ కాపు కులాల పక్కనే ఉండడం మాల వాళ్ళు భూమి సాగు చేసుకోవడము సహించలేని కాపు కులస్తులు అనేక సార్లు గొడవలకు పాల్పడ్డారు. పోలీసులు ఎప్పుడు పట్టించుకున్న పాపాన పోలేదు. జూన్‌ పన్నెండున రాజ్యం, పోలీసు బలగాలు అన్ని ఉప ఎన్నికలలో మునిగి ఉన్న సందర్భం చూసి దళితుల ఇండ్లపై గొడ్డళ్ళు, బడిసెలు పట్టుకొని అరాచకం సృష్టించి పాశవికంగా దాడి చేసారు. ఈ దాడిలో ఐదుగురు కుల రక్కసికి బలి అయినరు. ఒక్కొక్కళ్ళ వొంటిమీద దాదాపు నలభై నుండి, యభై కత్తిపోట్ల ఇప్పటికీి 30 మంది దాకా ఆసుపత్రిలోనే ఉన్నారు. 71మంది పేర్లు నమోదు చేసినా ఇప్పటికి ఒక్కరు కూడా అరెస్ట్‌ కాలేదు.
కుల నిర్మూలన, బీసీ మహాజన సమితి, చైతన్య మహిళ సమైక్య, తదితరులు నిజనిర్ధారణకు శ్రీకాకుళం వెళ్లి అక్కడ పరిస్థితిని మీడియాకి వివరించారు. అక్కడ జరిగిన దాడి కేవలం దళితులకు ఎటువంటి హక్కులు ఉండకూడదనే బరితెగించి ఈ ఊచకోతకి పాల్పడ్డారు. ఈ దేశంలో దళితులకి భూమి ఉండకూడదు, వారికి రాజ్యాధికారం నామమాత్రంగానే ఉండాలి, వారి చెప్పు చేతల్లో నడుచుకునే వారికి మాత్రమే పదవులు కల్పించాలి. ఇది ఇక్కడి న్యాయసూత్రం. ఏండ్లు గడుస్తున్న కూడ దళితుల పరిస్థి ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది. ప్రభుత్వపు బళ్ళు, హాస్టళ్ళు నరక కూపాలుగా ఉన్న ఎవరూ పట్టించుకోరు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు అసాంఘిక చర్యలు, అమానుష చర్యలకు పాల్పడుతున్నట్టు అక్కడా ఇక్కడా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అమ్మాయిలు బలి అయితున్నారని అనేక సార్లు రిపోర్ట్‌ చేసినారు. ఇప్పటికి 80 శాతం భూమి పైననే ఆధారపడి జీవిస్తున్నారు దళితులూ, కూలి నాలి పనులు చేసుకుంటూ బతుకులు వెళ్లదీస్తున్నారు. దళితులకు భూమి అనే నినాదం కేవలం నినాదాలుగానే మారిపోయినాయి. ఎంత పెద్ద మాల మహానాడు కాని, మాదిగ దండోరాలు కాని, దళిత సంఘాలు, అంబేద్కర్‌ సంఘాలు దళితులకు భూమి కావాలని డిమాండ్‌ చేయడంలో పూర్తిగా విఫలమైనాయి. ఇప్పటికి అసైన్‌ భూములు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పరం అయితూనే ఉన్నాయి, భూములు పంచండి అనే స్లోగన్‌ అక్కడో, ఇక్కడో కాని వినబడదు. పోలెపల్లి లాంటి ప్రాంతంలో పచ్చని దళితుల బతుకులు బుగ్గిపాలు అయినాయి. బలవంతంగా భూములు గుంజుకుని సెజ్జులని పేరుపెట్టి కోట్లు గడిస్తున్న ప్రభుత్వాలు, కంపెనీలు కనీసం చస్తే బొంద పెట్టడానికి కూడా ఆరు గజాల జాగని ఇచ్చే పరిస్థితిలో లేవు. శవాలను కిలోమీటర్ల దూరం తీసుకొని పోయే పరిస్థితి పల్లెల్లో దాపురిస్తుంది. దీనికి ఏది అంతం? ఇదేనా ప్రజాస్వామ్యం? ఎవరికీ ఈ అభివృద్ధి? భూమి సామాజిక,ఆర్థిక అవసరం నేటికి కూడ ఇది ఒక సంస్కృతికి చిహ్నం. భూమి ఉంటే బతుకు ఉంటది. భూమిని దళితులను వేరు చేసి చూడడం తల్లిని పిల్లనీ వేరు చేయడమే. భూమిని దళితుల చేతిలో ఉంచితే వారు బలపడే అవకాశం ఉంది కాబట్టి భూమి లేకుండా చేసే వారికి స్థాన బలం దక్కకుండా వలసలు పోయేటట్టు చేయడం, పావలా కిలో బియ్యం పథకం, పనికి ఆహార పథకం, పది పైసలకు రుణాలు అని బోగస్‌ పథకాలను అంటగట్టి దళితుల బతుకులను భ్రష్టుపట్టిస్తున్నారు. నేటికి కూడా భూమి అడిగిన వాడిని ఏదో విధంగా చిత్ర హింసలు పెడుతున్నారు. వందల వేల ఎకరాలను కలిగి ఉన్న ఆసాములను ప్రశ్నించరు. ప్రభుత్వ పథకాలలో వారి భూములు ఎన్నడు కూడా కనపడవు. కనపడినా వారికి చేతి నిండుగా నష్ట పరిహారం అందుతుంది. ఒకవేళ అందక పోయిన కూడా పది కాలాలపాటు సరిపోయేంత వెనకేసుకున్న సొమ్ము ఉంటుంది.
సెజ్జులకి, రింగ్‌ రోడ్లకు, ప్రాజెక్టులకు , దొరల స్వార్థాలకు బలి అయిన దళితుల బతుకులను అంచనా వేయడం ఇప్పటికి కూడా కష్టమే. వెంటనే దళిత సంఘాలు ప్రజాస్వామిక వాధులు లక్షింపేట దళితులకు జరిగిన అన్యాయాన్ని ఖండించి అక్కడ ఉన్న అన్ని కుటుంబాలి కనీసం ఐదు ఎకరాల చొప్పున భూమిని పంచి ఇచ్చి, దోషులను వెంటనే శిక్షించేటట్టుగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేయాలి. దళితుల సమస్య కేవలం దళితులదే కాదు ఇది సభ్య సమాజం తలవంచుకునే సమస్య. కులం ఒక క్రింది కులాల సమస్య మాత్రమే కాదు. ఇది జాతిని పట్టి పీడిస్తున్న పెద్ద మాయదారి రోగం, దీనిని ప్రశ్నించకుండా, మాట్లాడకుండా ఇంక ఏ సమస్యను కూడా మాట్లాడలేము. వెంటనే దళితులకి, బడుగులకి భూ పంపిణీని అమలు చేయాలని ప్రభుత్వాలను డిమాండ్‌ చేద్దాం! పేదల పక్షానా, కులానికి బలైపోతున్న దళితున్నలకు, అక్కలకు అండగా నిలబడదాం!..
సుజాత సూరేపల్లి