ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యలపై దళితనేతల మండిపాటు
ఉద్యమకారుడుకు బండకు పదవిపై దురుసు వ్యాఖ్యలు తగవని హితవు
హుజూరాబాద్,అగస్టు23(జనంసాక్షి): హుజూరాబాద్ నియోజకవర్గానికి దళిత సంఘాల నాయకులు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈటల రాజేందర్ వల్లే హుజురాబాద్‌కు చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు బండ శ్రీనివాస్‌కు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి వచ్చిందన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిరచారు. సోమవారం హుజూరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దళిత సంఘాల నేతలు విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్‌కు చెందిన ఉద్యమకారుడు, దళిత నేత బండ శ్రీనివాస్‌కు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ
ఆవిర్భావవం నుంచి శ్రీనివాస్ పార్టీ కోసం నిబద్ధతతో పని చేస్తున్నారని తెలిపారు. 1990 నుంచే బండ శ్రీనివాస్ రాకీయాల్లో ఉన్నారని.. టీఆర్‌ఎస్ పార్టీలో ఆయన కంటే ఈటల రాజేందర్ చాలా జూనియర్ అని చెప్పారు. శ్రీనివాస్ విద్యార్థి దశ నుంచే సామాజిక సేవలో ఉన్నారని తెలిపారు. ఈటల రాజేందర్‌లా బండ శ్రీనివాస్ గులాబీ పార్టీకి వెన్నుపోటు పొడవలేదన్నారు. కుట్రలు చేయలేదన్నారు. పార్టీ కోసం నిబద్ధతతో పని చేశారని దళిత నాయకులు స్పష్టం చేశారు. బండ శ్రీనివాస్ టీఆర్‌ఎస్ పార్టీకి, ప్రజలకు చేసిన సేవలు గుర్తించి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశం కల్పించారు. దళిత వ్యతిరేక పార్టీ అయిన బీజేపీకి, దళిత బంధు ద్వారా దళితులు లబ్ది పొందడం ఇష్టం లేదన్నారు. దళిత వర్గాల అభ్యున్నతికి కేంద్రం ఏ ఒక్క పథకమైనా అమలు చేస్తుందా? అని ప్రశ్నించారు. బీజేపీ దళితులను ఏనాడూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఎంపీ అరవింద్ పసుపు రైతులను మోసం చేసి.. తప్పుడు వాగ్దానాలతో మభ్యపెట్టి గెలిచాడన్న విషయం మరిచిపోవద్దని దళిత సంఘాల నాయకులు సూచించారు. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్, దళితుడైన రామస్వామిపై కక్షకట్టి రాజీనామా చేయించి వేధించిన చరిత్ర ఈటలది అని గుర్తు చేశారు. ఈటల ఏ దళిత నాయకుడిని ఎదగనివ్వలేదు, నిర్దాక్షిణ్యంగా అణచివేసాడు అని పేర్కొన్నారు. ఎంపీ అరవింద్ ఇప్పటికైనా ప్రేలాపనలు మానుకోవాలి.. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి బుద్ది చెప్పేందుకు దళితులు సిద్ధంగా ఉన్నారు అని దళిత సంఘాల నాయకులు తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో కనుమళ్ల గణపతి, మొలుగూరి ప్రభాకర్, ఇల్లందుల శ్రీనివాస్, పోచంపల్లి సదయ్య, కనకం రాజ్ కుమార్, కొత్తూరి మొగిలి, దీవెన్, శనిగరం సతీష్, మొలుగు సాంబరాజు పాల్గొన్నారు.