ప్రత్యేక సీమ కోసం పోరాటం చేయాలి

కడప, ఆగస్టు 1 : ప్రత్యేక రాయలసీమ కోసం సీమప్రాంత ప్రజాప్రతినిధులందరూ ఉద్యమించాలని రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వెంకటశివారెడ్డి డిమాండ్‌ చేశారు. కడప ప్రెస్‌క్లబ్‌లో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక రాయలసీమ కోసం మేలుకొల్పు పేరుతో ఈ నెల 4వ తేదీన కర్నూలులోని శ్రీకృష్ణదేవరాయ విగ్రహం వద్ద 96 గంటలు నిరవధిక దీక్షలు చేపట్టనున్నట్లు వారు చెప్పారు. రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కర్నాటకలోని రాయచూరు, బల్లారి, కోలారు, తమిళనాడులోని కృష్ణగిరి, రాయవేలేరు 11 జిల్లాలతో కలిసి ప్రత్యేక రాయలసీమను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ప్రస్తుత కర్ణాటక, తమిళనాడులో ఉన్న జిల్లాలు ఆంధ్ర రాష్ట్రం విభజనకు ముందు రాష్ట్రంలో ఆంధ్ర భాగంగా ఉండేవని చెప్పారు. రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి పదవి పట్ల, తప్ప ప్రత్యేక రాష్ట్రం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. టిడిపి, కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు ప్రత్యేక రాయలసీమకు అనుగుణంగా ప్రభుత్వాలపై తీర్మానం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కలిసొచ్చే మేధావులు, ఇతర వర్గాలతో కలిసి ఆందోళన చేసేందుకు సిద్ధంగా ఉండాలని వారు ప్రకటించారు.