ప్రభుత్వం, స్వచప్ఛంద సంస్థల సమన్వయంతో అభివృద్ధికలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి

శ్రీకాకుళం, జూన్‌ 27 : జిల్లాలో ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల(ఎన్జీవో) సమన్వయంతో పర్యావరణం, విద్య, మొక్కల పెంపకం, తదితర అంశాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్‌ జి.వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఎచ్చెర్లలోని మహిళా ప్రగతి కేంద్రంలో ఈ మూడు అంశాలపై నిర్దిష్ట ప్రణాళిక తయారు చేసేందుకు డి.ఆర్‌.డి.ఏ., విద్యాశాఖ, ఆర్‌డబ్ల్యుఎస్‌, అటవీశాఖ, ఎన్జీవో ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్‌ అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తింపు పొందినా, పలు అంశాలలో బాగా వెనుకబడి ఉన్నామని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో చిన్నచిన్న పురపాలక సంఘాల ఏడాది ఆదాయం హైదరాబాద్‌ నగరపాలక సంస్థ కంటే ఎక్కువగా ఉంటుందన్నారు. ఆయా దేశాల్లో జనాభా తక్కువ, వనరులు ఎక్కువగా ఉండటమే కారణమన్నారు. దేశంలో మానవ వనరులు అధికంగా ఉన్నా ప్రతి పని ప్రభుత్వమే చేస్తుందన్న భావన ప్రజల్లో ఉందన్నారు. దీంతో తమ బాధ్యతలు విస్మరిస్తున్నారని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా పని చేసి లక్ష్యం సాధించాలని కోరారు. ఈ సమావేశానికి సుమారు 60కి పైగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరైయ్యారు.200 గ్రామాల దత్తత ః- జిల్లాలో 200 గ్రామాలను నిర్ధేశించిన అంశాల్లో అభివృద్ది చేసేందుకు దత్తత ఇచ్చారు. ఈ గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం, మొక్కల పెంపకం, బడిబయట పిల్లలను బడిలో చేర్పించి ప్రాథమిక విద్యా లక్ష్యాలను చేరుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీనికి సంబంధించిన కార్యచరణ ప్రణాళికను ఐదు రోజుల్లో తయారు చేసి నివేదిక అందజేయాలని ప్రభుత్వ, ఎన్జీవో సంస్థల సమన్వయకర్త వి.జగన్నాథంనాయుడుకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ నీటిపారుదల విభాగం అధికారులు స్థానిక సమస్యల పరిష్కారంలో పారదర్శకంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ ఏపీడీ పి.కోటేశ్వరరావు, డీఈఓ అరుణకుమారి, రాజీవ్‌ విద్యామిషన్‌ పీవో బి.నగేష్‌, గ్రామీణ నీటిపారుదల శాఖ, అటవీ శాఖ, అధికారులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.