బాల్య వివాహాల నివారణలో శ్రీకాకుళం ముందంజ

శ్రీకాకుళం, జూన్‌ 27 : బాల్య వివాహాల నివారణలో శ్రీకాకుళం జిల్లా ముందంజలో ఉంది. జిల్లాలో గతేడాది కాలంగా 14 బాల్య వివాహాలను నివారించింది. ప్రభుత్వం బాల్య వివాహాల నివారణ చట్టం-2006ను తెచ్చిన సంగతి విదితమే. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలోని కమిటీ, ఐసిడిఎస్‌, చైల్డ్‌లైన్‌ సంస్థలలోని సభ్యులు 14 మంది జీవితాలను కాపాడారు. ఆమదాలవలస పట్టణం పంతులు పేటకు చెందిన ముంగింటి అమ్మలు, ఆమదాలవలస మండలం చింతలపేట గ్రామానికి చెందిన సాధు పావని, బూర్జ మండలం పాలవలస గ్రామానికి చెందిన లంకా మీనాక్షి, లావేరు మండలం వెంకటపురం గ్రామానికి చెందిన శంబర సంతు, శానాపతి రమణమ్మ, రణస్థలం మండలం అర్జునవసలకు చెందిన కంటా వరలక్ష్మి, కవిటి మండలం కొత్తకొజ్జిరికి చెందిన ఉప్పాడ జయశ్రీ, పంపాన ధనలక్ష్మి, సరుబుజ్జిలి మండలం కెజెపేట నూక దివ్య, పొందూరు మండలం పెనుబర్తికి చెందిన ఇలపండా రజని, ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశంకు చెందిన చింతపల్లి తోటయ్య, జి.సిగడాం మండలం జగన్నాధ పురంకు చెందిన కొమరపురి మజ్జమ్మ, మరో రెండు కేసులను నివారించామని ఐసిడిఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌, కమిటీ కన్వీనర్‌ టివిఎస్‌ శ్రీనివాస్‌ తెలిపారు. జిల్లాలో 38 మండల మహిళా సమాఖ్యలు, 18 ఐసిడిఎస్‌ ప్రాజెక్టులు, అంగన్‌వాడి కేంద్రాల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజాపథం కార్యక్రమంలో 206 గ్రామ సభల్లో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాలను వివరించామని పేర్కొన్నారు. చైల్డ్‌ లైన్‌ సంస్థ ద్వారా గ్రామాల్లో ఓపెన్‌ హౌస్‌ సెషన్‌ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. బాల్య వివాహాలను నియంత్రించి అటువంటి బాలలను ప్రత్యేక జువనైల్‌ పోలీసు యూనిట్‌ రక్షణలో ఉంచుతున్నట్టు జిల్లా బాల్య వివాహాల రక్షణ అధికారి కెవి రమణ తెలిపారు. ఐసిడిఎస్‌ ప్రాజెక్టు అధికారి, మండలంలో తహసీల్దారు నేతృత్వంలో కమిటీలు పనిచేస్తాయని పేర్కొంది. ఈ కమిటీలు బాల్య వివాహాల నియంత్రణ చర్యలు చేపడతాయని జీవోలో సూచించారు. బాల్య వివాహాల నియంత్రిత అధికారి పోలీసు అధికారాలను కలిగి ఉంటారని, విచారణ, కేసులు నమోదు చేయడం, తదితర పనులు చేస్తారని జీవోలో పేర్కొంది.