సగం.. సగం..
` ఎన్డీయే అభ్యర్థుల ఎంపిక కొలిక్కి..
` భాజపా, జేడీయూకు చెరో 101 స్థానాలు..
` నలుగురు సిట్టింగ్‌లకు ఉద్వాసన
పాట్నా(జనంసాక్షి):బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార ఎన్డీయే కూటమి పార్టీల్లో సీట్ల కేటాయింపుపై ముమ్మర కసరత్తు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌కు చెందిన జేడీయూలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. 243 స్థానాల్లో 103 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని ఓ సీనియర్ నేత వెల్లడిరచారు. దాదాపు అన్ని స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయని, నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని చెప్పారు. వారి పేర్లను మాత్రం ఆయన వెల్లడిరచలేదు.‘‘జేడీయూ పోటీ చేయనున్న స్థానాలను ఇప్పటికే గుర్తించాం. ఆయా అభ్యర్థులను కూడా ఖరారు చేశాం. పనితీరు బాగాలేని నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొత్తవారితో భర్తీ చేసే అవకాశం ఉంది. భాగల్‌పుర్, నవాదా, బంకా జిల్లాల్లో ఈ నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా గత వారం మా ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ ఆర్జేడీలో చేరిన నేపథ్యంలో.. పర్బత్తా స్థానంలో కొత్త అభ్యర్థిని బరిలోకి దింపనున్నాం. మాజీ ఎమ్మెల్యే బీమా భారతీ ప్రతిపక్ష పార్టీలో చేరడంతో.. రుపౌలిలోనూ ఇదే విధంగా ముందుకెళ్తాం’’ అని జేడీయూ నేత తెలిపారు. సీట్ల సర్దుబాటుపై ఎన్డీయే సీనియర్ నేతలు తగిన సమయంలో అధికారిక ప్రకటన చేస్తారన్నారు.
పార్టీల్లో సీట్ల సిగపట్లు!
ఎన్డీయేలో సీట్ల సర్దుబాటుపై ఆదివారం ప్రకటన వెలువడుతుందని భాజపా బిహార్‌శాఖ అధ్యక్షుడు దిలీప్ జైశ్వాల్ ఇప్పటికే తెలిపారు. కాషాయ పార్టీ 102 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో 22 సీట్లలో పోటీ చేసిన లోక్ జన్‌శక్తి పార్టీ (రాంవిలాస్) అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్.. ఈసారి అదనపు సీట్లు అడుగుతున్నారు. ఎన్డీయేలోని హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం), రాష్ట్రీయ లోక్‌మోర్చా (ఆర్‌ఎల్‌ఎం)లకు గౌరవప్రదమైన సంఖ్యలో సీట్ల కేటాయింపు ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో వచ్చే నెల 6, 11వ తేదీల్లో రెండు దశల్లో పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.