అవినీతి తిమింగలం

` కిలోల కొద్దీ వెండి, బంగారం, నగదు, లగ్జరీ కార్లు, 17 టన్నుల తేనె
` మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ అధికారి జీపీ మెహ్రా అవినీతి బాగోతం
భోపాల్‌(జనంసాక్షి):కోట్ల రూపాయల విలువ చేసే బంగారం, కిలోల కొద్దీ వెండి, లెక్కపెట్టలేనంత డబ్బు, లగ్జరీ కార్లు, టన్నుల కొద్దీ తేనె.. ఏంటి లెక్కలు అనుకుంటున్నారా? ఒక అవినీతి తిమింగలం ఇంట్లో దొరికిన అక్రమ సంపద ఇది.మధ్యప్రదేశ్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌కి చెందిన రిటైర్డ్‌ ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్‌ భోపాల్‌ జీపీ మెహ్రా అవినీతి బాగోతం దర్యాప్తు అధికారులనే నివ్వర పోయేలా చేసింది.క్రైమ్‌ థ్రిల్లర్‌ను తలపించే ఈ స్టోరీ గురువారం నాటి దాడుల్లో వెలుగులోకి వచ్చింది. అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్‌ లోకాయుక్త రిటైర్డ్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ చీఫ్‌ ఇంజనీర్‌ మెహ్రాకు భోపాల్‌లోని మణిపురం కాలనీలోని అతని నివాసం, ఇతర ఆస్తులపై అధి?కారులు దాడి చేశారు. ఈ సందర్బంగా కళ్లుచెదిరే సంపదను గుర్తించారు. డబ్బులను లెక్కపెట్టేందుకు యంత్రాలను తెప్పించాల్సివ చ్చిందంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. ఇటీవలి కాలంలో మధ్యప్రదేశ్‌లో అత్యంత సంచలనాత్మక అవినీతి కథలలో ఒకటిగా నిలిచింది. లోకాయుక్తలోని నలుగురు డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ స్థాయి అధికారులు భోపాల్‌ ,నర్మదాపురంలోని నాలుగు ప్రదేశాలలో దాడుల బృందాలు దాడులు నిర్వహంచాయి. జి పి మెహ్రా తన పదవీకాలంలో అవినీతితి భారీ సంపదను కూడబెట్టారనే ఫిర్యాదుల ఆధారంగా లోకాయుక్త డైరెక్టర్‌ జనరల్‌ యోగేష్‌ దేశ్‌ముఖ పర్యవేక్షణలో ఈ సోదాలు నిర్వహించినట్లు భోపాల్‌ లోకాయుక్త ఎస్పీ డి రాథోడ్‌ పిటిఐకి తెలిపారు.మణిపురం కాలనీ , దానా పానీ సమీపంలోని ఓపాల్‌ రీజెన్సీ, భోపాల్‌లోని గోవింద్‌పుర పారిశ్రామిక ప్రాంతంలోని అతని ఫ్యాక్టరీ కె టి ఇండస్ట్రీస్‌, నర్మదాపురం జిల్లాలోని సోహాగ్‌పూర్‌ తహసీల్‌ పరిధిలోని సైని గ్రామంలోని ఆస్తులపై ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్లు లోకాయుక్త తెలిపింది. ఈ సోదాల్లో కోట్లకు పైగా విలువైన బంగారం , కిలోల కొద్దీ వెండి దొరికింది. అంతేకాదు ఫామ్‌హౌస్‌లో చక్కగా పేర్చబడిన 17 టన్నుల తేనె దొరకడ మరింత ఆశ్చర్యకరంగా నిలిచింది.
పామ్‌ హౌస్‌లో 17 టన్నుల తేనె, లగ్జరీ కార్లు
రూ.8.79 లక్షల నగదు, రూ.56 లక్షల విలువైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కనుగొన్నారు. మరో ఇంట్లో అక్కడ దర్యాప్తు అధికారులు రూ.26 లక్షల నగదు, రూ.3.05 కోట్ల విలువైన 2.6 కిలోగ్రాముల బంగారం, 5.5 కిలోగ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు.అలాగే తహసీల్‌ సోహగ్‌పూర్‌ (నర్మదపురం)లోని సైని గ్రామంలోని మెహ్రా ఫామ్‌హౌస్‌లో మరో సామ్రాజ్యాన్ని కనుగొన్నారు. 17 టన్నుల తేనె, ఆరు ట్రాక్టర్లు, నిర్మాణంలో ఉన్న 32 భవనాలు, ఏడు పూర్తయినవి, చేపల చెరువు కూడా. దానికి తోడు, ఒక గోశాల, ఒక ఆలయం, ఫోర్డ్‌ ఎండీవర్‌, స్కోడా స్లావియా, కియా సోనెట్‌,మారుతి సియాజ్‌ వంటి లగ్జరీ కార్లు అన్నీ మెహ్రా కుటుంబం పేరు మీద నమోదై ఉన్నాయి. ఈ ఆపరేషన్‌ గోవింద్‌పురా ఇండస్ట్రియల్‌ ఏరియాలోని కెటి ఇండస్ట్రీస్‌లో కూడా కొనసాగింది. ఇది మెహ్రా వ్యాపార సంస్థగా భావిస్తారు.ఇక్కడ, అధికారులు పరికరాలు, ముడి పదార్థాలు, రూ.1.25 లక్షల నగదు, మెహ్రా బంధువులు సంస్థలో భాగస్వాములుగా ఉన్నారని చూపించే పత్రాలను కనుగొన్నారు. ఈ యూనిట్‌ మెహ్రా కుమారుడు రోహిత్‌ , కైలాష్‌ నాయక్‌ సంయుక్తంగా యాజమాన్యంలో ఉన్నట్లు తెలిపింది. బీమా పాలసీలు, వాటా పత్రాలు, బహుళ ఆస్తులు, అనేక కోట్ల ఆస్తులను లోకాయుక్త అధికారులు ధృవీకరించారు. స్వాధీనం చేసుకున్న పత్రాలు, డిజిటల్‌ ఫైళ్లు, బ్యాంకింగ్‌ రికార్డులను పరిశీలించడానికి ఫోరెన్సిక్‌ బృందాలను నియమించారు.