మంత్రి శ్రీధర్‌ బాబుకు అరుదైన గౌరవం

` ఆస్‌ బయోటెక్‌ సదస్సుకు ఆహ్వానం
` లైఫ్‌ సైన్సెస్‌ రంగం సాధించిన పురోగతిపై కీలకోపన్యాసం
` భారత్‌లో ఘనత దక్కించుకున్న తొలి మంత్రి
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి డి.శ్రీధర్‌ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో ’ఆసియా`పసిఫిక్‌’ ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా పరిగణించే ’ఆస్‌బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 2025’లో ఆయన కీలకోపన్యాసం చేయనున్నారు. ఆస్టేల్రియా కాన్సుల్‌ జనరల్‌ హిల్లరీ మెక్‌గీచీ ఈ మేరకు ఆహ్వానం పలికారు. దేశంలో ఈ గౌరవం దక్కిన ఏకైక మంత్రి శ్రీధర్‌ బాబు కావడం గమనార్హం. ఈ నెల 21 నుంచి 24 వరకు ఆస్టేల్రియాలోని మెల్‌బోర్న్‌లో సదస్సు జరగనుంది. ఈ రెండేళ్లలో లైఫ్‌ సైన్సెస్‌ రంగం సాధించిన పురోగతిపై మంత్రి శ్రీధర్‌ బాబు ప్రసంగించ నున్నారు. తెలంగాణలో ఈ రంగంలో అనుకూలతలు, అవకాశాలపై మాట్లాడనున్నారు. రాష్టాన్రికి కొత్త పెట్టుబడులు తీసుకొచ్చే అవకాశం ఆయనకు దక్కింది.తెలంగాణలో లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో గత రెండు సంవత్సరాల్లో రూ.63,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, ఫార్మా, బయోటెక్‌, మెడ్‌టెక్‌ రంగాల్లో ప్రపంచ స్థాయి కేంద్రంగా ఎదిగిన నేపథ్యంలో ఈ ఆహ్వానం వచ్చింది. తాజా సీబీఆర్‌ నివేదిక ప్రకారం హైదరాబాద్‌ ప్రపంచంలోని టాప్‌ 7 లైఫ్‌ సైన్సెస్‌ క్లస్టర్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ జాబితాలో చోటు దక్కిన ఏకైక భారత నగరంగా హైదరాబాద్‌ నిలిచింది.