ట్రంప్‌ సుంకాల బెదిరింపులకు భయపడం

` వారి చర్యలను దీటుగా ఎదుర్కొంటాం
` అమెరికా టారీఫ్‌లపై చైనా స్పందన
బీజింగ్‌(జనంసాక్షి): అగ్రరాజ్యం అమెరికా , డ్రాగన్‌ కంటీ చైనా మధ్య టారిఫ్‌ల విషయంలో మరోసారి మాటల యుద్ధం నడుస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప విధించిన టారిఫ్‌ల అంశంపై తాజాగా చైనా స్పందించింది.ఈ సందర్బంగా అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని తీవ్ర విమర్శలు చేసింది. ఇలాంటి నిర్ణయాలు రెండు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.ట్రంప్‌ నిర్ణయాలపై తాజాగా చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ కౌంటర్‌ ఇచ్చింది. అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించింది. ఈ చర్యలు చైనా ప్రయోజనాలకు తీవ్రంగా హాని కలిగిస్తాయని పేర్కొంది. రెండు వైపులా ఆర్థిక, వాణిజ్య చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని వివరించింది. ప్రతీ విషయంలోనూ చైనాపై అధిక సుంకాలు విధిస్తామని బెదిరించడం సరైన మార్గం కాదు. అమెరికా తన తప్పుడు పద్దతులను వెంటనే సరిదిద్దుకోవాలి. చైనా-అమెరికా మధ్య స్థిరమైన వాణిజ్య సంబంధాలను మేము కోరుకుంటున్నాం. ట్రంప్‌ నిర్ణయాలు ఇలాగే కొనసాగితే చైనా తన చట్టబద్దమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటుంది అని హెచ్చరించింది.కాగా, అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంపై ట్రంప్‌ ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా వేదికగా చైనా తీరు తనను షాక్‌కు గురిచేసిందని పేర్కొన్నారు. అనంతరం, చైనా ఉత్పత్తులపై అదనంగా 100 శాతం టారిఫ్‌లు విధించబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరో బాంబు పేల్చారు. ఇవి నవంబర్‌ 1వ తేదీ లేదా అంతకంటే ముందే అమల్లోకి వస్తాయని స్పష్టంచేశారు. అంతేకాకుండా నవంబర్‌ 1 నుంచి క్రిటికల్‌ సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులపై కొన్నిరకాల నియంత్రణలు విధిస్తామని తేల్చిచెప్పారు. ఇక, చైనా ఉత్పత్తులపై ఇప్పటికే 30 శాతం సుంకాలు అమలవుతున్నాయి. ట్రంప్‌ ప్రకటించిన అదనపు సుంకాలతో కలిపితే మొత్తం సుంకాలు ఏకంగా 130 శాతానికి చేరడం గమనార్హం.ప్రతీకార చర్యల్లో భాగంగానే చైనా ఉత్పత్తులపై 100 శాతం అదనపు సుంకాలు ప్రకటించినట్లు తెలుస్తోంది. అరుదైన ఖనిజాల విషయంలో అసలేం జరగబోతోందో చూద్దామని, అందుకే నవంబర్‌ 1వ తేదీని డెడ్‌లైన్‌గా విధించామని పేర్కొన్నారు. నియంత్రణల విషయంలో చైనా వెనక్కి తగ్గితే అదనపు టారిఫ్‌ల నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటామని పరోక్షంగా సంకేతాలిచ్చారు.