2030 కామన్‌వెల్త్‌ గేమ్స్‌ భారత్‌లో..

` నిర్వహణ హక్కులు దక్కించుకున్న ఇండియా
` అహ్మదాబాద్‌ను వేదికగా ఎంపిక చేస్తూ కామన్‌వెల్త్‌ స్పోర్ట్‌ బాడీ నిర్ణయం
` నైజీరియాతో పోటీపడి ఆతిథ్య హక్కులు చేజిక్కించుకున్న వైనం
` 26న గ్లాస్గో జనరల్‌ అసెంబ్లీ సమావేశంలో అధికారికంగా ప్రకటన
న్యూఢల్లీి(జనంసాక్షి):భారత్‌ మరోసారి అంతర్జాతీయ క్రీడా వేదికగా నిలవబోతోంది. 2030 కామన్‌వెల్త్‌ గేమ్స్‌ నిర్వహణ హక్కులను భారత్‌ దక్కించుకుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరాన్ని వేదికగా ఎంపిక చేస్తూ కామన్‌వెల్త్‌ స్పోర్ట్‌ బాడీ నిర్ణయం తీసుకుంది.లక్షా 32 వేల సామర్థ్యం కలిగిన నరేంద్ర మోదీ స్టేడియం లాంటి ప్రపంచ ప్రఖ్యాత క్రీడా ప్రాంగణం ఉండటంతో అహ్మదాబాద్‌కు ఈ గౌరవం దక్కింది. నైజీరియాలోని అబూజా నగరంతో పోటీపడి అహ్మదాబాద్‌ ఆతిథ్య హక్కులు దక్కించుకుంది. నవంబర్‌ 26న గ్లాస్గోలో జరగనున్న జనరల్‌ అసెంబ్లీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ఆతిథ్య హక్కులను దక్కించుకోవడం భారత్‌కు ఇది రెండో సారి. 2010లో న్యూఢల్లీి వేదికగా భారత్‌లో తొలిసారి ఈ క్రీడలు జరిగాయి. 2030 గేమ్స్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇవి శతాబ్ది వేడుకలుగా జరుగనున్నాయి. 1930లో తొలిసారి ఈ క్రీడలు పరిచయం? చేయబడ్డాయి. నాడు కెనడాలో హామిల్టన్‌లో ఈ క్రీడలు జరిగాయి.భారత్‌కు కామన్‌వెల్త్‌ గేమ్స్‌ నిర్వహణ అవకాశం దక్కడంపై కామన్‌వెల్త్‌ గేమ్స్‌ అసోసియేషన్‌ ఇండియా అధ్యక్షురాలు పి.టి ఉష స్పందించారు. 2030 కామన్‌వెల్త్‌ గేమ్స్‌ భారత యువతకు ప్రేరణగా నిలుస్తాయని అన్నారు. ఈ క్రీడల నిర్వహణ కామన్‌వెల్త్‌ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలపరిచే గొప్ప అవకాశంగా పేర్కొన్నారు.కాగా, గత ఎడిషన్‌ (72వది) కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ఇంగ్లండ్‌లోని బర్మింగ్హమ్‌ నగరంలో జరిగాయి. తదుపరి ఎడిషన్‌ వచ్చే ఏడాది జరుగనుంది. ఈసారి స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరం ఈ క్రీడలకు ఆతిథ్యమివ్వనుంది.
గర్వించదగిన విషయం : అమిత్‌ షా
కామన్వెల్త్‌ క్రీడలు భారత్‌లో జరగనుండడంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పందించారు. అహ్మదాబాద్‌లో నిర్వహించేందుకు కామన్వెల్త్‌ అసోసియేషన్‌ ఆమోదం తెలపడం గర్వించదగిన విషయమన్నారు. ప్రపంచ క్రీడా పటంలో భారత్‌ను ఉంచడానికి ప్రధాని మోదీ చేస్తున్న నిరంతర ప్రయత్నాలకు ఇది నిదర్శనమన్నారు.