బీజేపీ తన మౌనం వీడాలి

తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అంటూ బీజేపీ అట్టహాసంగా ఒక్క వోటు- రెండు రాష్ట్రాలు అంటూ కాకినాడ తీర్మానాన్ని జనం ముందుకు తెచ్చింది. జనం ఓట్లేయదని ఆ తర్వాత దాన్ని అటకెక్కించింది. ఏదో అపుడప డు నినాదాలు చేస్తే జనం నమ్మరు. ఏదైనా అంశంపై తీర్మానాన్ని చేస్తే దాన్ని ఒక నిర్దిష్ట ప్రణాళికతో అమలు చేయడానికి తమ శాయశక్తులా కృషిచేయాలి. ఉద్యమమైనా అంతే. ఒక పథకం ప్రకారం ఉద్యమాన్ని నడపాలి. అయితే తెలంగాణ ఉద్యమంలో బీజేపీ తాలూకు వరుస వైఫల్యాలు చాలానే ఉన్నాయి. ఒక్క సారి తీర్మానాన్ని చేస్తే చాలు దాన్ని తర్వాత పట్టించుకోకున్నా పర్వాలేదు అన్నట్లు వ్యవహరిస్తుంది. టీజీ ఉద్యమంలో బీజేపీ ఇపుడుఎక్కడుందో ఒక సారి ఆలోచించుకోవాలి. పరకాల ఉప ఎన్నికల ఓటమి అనంతరం ఒక్కసారిగా మౌనం వహించిన బీజేపీ దాని కారణాన్ని ప్రజలకు వివరించాలి. ఎన్నికలలో గెలుపు ఓటములు సహజం. జాతీయ పార్టీ అయిన బీజేపీకి ఈ మాత్రం తెలియదనుకోవాలా? అలాంటిది ఒక్క ఎన్నికల్లో ఓడినంత మాత్రాన తెలంగాణ ఉద్యమంలో మౌనం వహించాలి. విజయమ్మ దండయాత్రపై బీజేపీ తన మౌనం వీడాలి. ఎందుకంటే తెలంగాణలో తిరగాలంటే పాస్‌పోర్టులు, వీసాలు అవసరమన్న పచ్చి సమైక్యవాది ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రత్యేక దేశ వాదనతో పోల్చిన ‘మహ’ నీయుడు అయిన వైయస్సార్‌ కుటుంబానికి చెందిన పార్టీ. అదే సమైక్యవాదాన్ని కొనసాగించి, పార్లమెంట్‌లో సమైక్యాంధ్ర ప్లకార్టులు పట్టుకొని నినాదాలు చేసిన వైైయస్‌ కొడుకు జగన్‌ అధ్యక్షుడైన పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మకు హఠాత్తుగా చేనేత సమస్యలు గుర్తుకొచ్చి సిరిసిల్ల పర్యటనకు వస్తే బీజేపీ ఒక్క మాట కూడా మాట్లాడలేదెందుకో? తెలంగాణ ప్రాంతం వైయస్‌ హయాంలో గురయినంతగా మరెవరి హయాంలోనూ దోపిడీకి గురికాలేదు. మన నీళ్లు, నిధులు దోచుకెళ్లారు. అలాంటి వైయస్‌ సతీమణి విజయమ్మ తెలంగాణ గడ్డపై పాగా వేయాలనుకొని మన నేతన్నల సమస్యలపై మొసలి కన్నీరు కారుస్తూ మన గడ్డపై అడుగుపెట్టింది. అయితే తెలంగాణకు అనుకూలమంటూ తీర్మానాలు చేసి, తమ వల్లే న్రత్యేక రాష్ట్రం వస్తుందంటున్న బీజేపీ కనీసం ఏమీ మాట్లాడకపోవడం భాదాకరం. తెలంగాణకు వ్యతిరేకమైన వైయస్సార్‌ పార్టీ ప్రజల మనోభావాలు పట్టకుండా సిరిసిల్ల గడ్డపై ధర్నా చేస్తుంటే కనీసం అడ్డుకోవాలంటూ పిలుపునివ్వకపోవడం దేనికి నిదర్శనం. పై పెచ్చు తెలంగాణ బిడ్డలను గొడ్డును బాదినట్లు బాదితే కనీసం దాన్ని వ్యతిరేకించకపోవడం భాదాకరం. నిజానికి చాలా రాజకీయ పార్టీలు తెలంగాణపై తమ తీర్మానాలను చేశాయి. కానీ వాటిని భయటపెట్టకుండా భద్రంగా వాటిని అటకపై పెట్టాయి. ఏ పార్టీ అయినా తీర్మానం చేస్తే దాన్ని అమలు చేయడానికి తీవ్రంగా కృషిచేయాలి. దానికోసం ఒక ప్రణాళిక ఏర్పరుచుకొని తీవ్రంగా దాని కోసం శ్రమించాలి. ఇకపైనా బీజేపీ సిరిసిల్లలో వైయస్‌ఆర్‌సీపీ పర్యటనపై, ఆ పర్యటనలో తెలంగాణ వాదులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించాలి.