భారత్‌, చైనా సరిహద్దులో పటిష్ట భద్రత

C
– అత్యాధునిక స్పోర్ట్స్‌ వాహనాలు అందజేత

న్యూఢిల్లీ,మే15(జనంసాక్షి):ఇండో చైనా సరిహద్దులోని ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ దళానికి అత్యాధునిక స్పోర్ట్స్‌ వాహనాలను సమకూర్చారు. ఒక్కో వాహనం ఖరీదు సుమారు 25 లక్షలు. లడక్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దులోని సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో గస్తీ నిర్వహించే దళాలకు ఆర్మీ వీటిని అందించింది. సరిహద్దులోని ఎలాంటి భారత దళానికి ఎంత ఖరీదైన స్పోర్ట్స్‌ వాహనాలు లేవు. అత్యవసర పరిస్థితుల్లో సైనిక అధికారులు, సైన్యం వెంటనే ఎత్తైన శిబిరాలకు చేరేందుకు వీటిని వినియోగిస్తారు.ఇండో చైనా సరిహద్దులోని టిబెట్‌ కమాండ్‌ హాదాను ఇటీవల పెంచిన చైనా, దాన్ని ఆ దేశ ప్రధాన రక్షణ వ్యవస్థ అయిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ పరిధిలోకి తెచ్చింది. భవిష్యత్తులో భారత్‌ను ఎదుర్కొనేందుకు చైనా ఇలాంటి సన్నాహాలు చేస్తోంది. భారత్‌ కూడా ధీటుగా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఐటీబీపీకి అత్యాధునిక స్పోర్ట్స్‌ వాహనాలు సమకూర్చింది.

భారత్‌కు అనుమానాస్పద ఫోన్‌ కాల్స్‌!

దేశ సరిహద్దు వెంబడి సైనికులను మోహరిస్తూ చైనా ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత దేశ సరిహద్దు గ్రామాల ప్రజలకు మరో తలనొప్పి వచ్చి పడింది. భారత్‌-చైనా సరిహద్దు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు గత కొద్దిరోజుల నుంచి అనుమానాస్పద ఫోన్‌ కాల్స్‌ ఎక్కువయ్యాయి. అయితే ఈ కాల్స్‌ చైనా నుంచి వచ్చాయా? లేక పాకిస్థాన్‌ నుంచా? అనేది తెలియరావటం లేదు.వివిధ నెంబర్ల నుంచి ఫోన్లు చేసి తాము సైనికాధికారులమని, లేదా ప్రభుత్వ అధికారులమని చెపుతూ సరిహద్దు గ్రామాల్లో ఉన్న భద్రత సిబ్బంది వివరాలను అడుగుతున్నారట. సైనికులు సుమారు ఎంతమంది ఉంటారు? ఏ సమయంలో ఎక్కడ ఉంటారు? తదితర ప్రశ్నలు అడుగుతున్నారని గ్రామస్థులు పేర్కొన్నారు.తాజాగా దర్బక్‌ గ్రామ సర్పంచ్‌కు కూడా ఇలాంటి ఫోన్‌ కాల్‌ ఒకటి వచ్చిందట. సముద్ర మట్టానికి 13,500 అడుగుల ఎత్తులో ఉన్న ఛాంగ్‌ లా, సంగేత్‌ గ్రామాల్లో పహారా కాస్తున్న ఆర్మీ సిబ్బంది వివరాలను గురించి అడిగారట. అదీ ఆ గ్రామ సర్పంచ్‌ ఆర్మీ క్యాంప్‌లో ఉండగా అడగటంతో అవతలి వ్యక్తి వివరాలను రాబట్టేందుకు ప్రయత్నించారు. దీంతో సదరు వ్యక్తి తాను డిప్యూటీ కమిషనర్‌ని అని చెప్పాడు. దీంతో విచారణ ప్రారంభించిన ఆర్మీ అధికారులు డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయానికి ఫోన్‌ చేయగా, అలాంటి కాల్‌ ఏవిూ తాము చేయలేదని చెప్పటం గమనార్హం.దీంతో అప్రమత్తమైన అధికారులు.. ఇలాంటి కాల్స్‌ వచ్చిన వెంటనే దగ్గర్లో ఉన్న ఆర్మీ యూనిట్‌కు తెలియజేయాలని గ్రామస్థులకు సూచించారు.