మహారాష్ట్ర సచివాలయంలో .. నిజానికి నిప్పు

ఆదర్శ రికార్డులపైనే అనుమానం
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయాలు దగ్ధం.
ముంబాయి : మహారాష్ట్ర సచివాలయంలో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎన్‌సిపి నేత రాష్ట్ర మంత్రి బబన్‌రావు పచ్‌పట్‌ కార్యాలయం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బహుళ అంతస్తుల భవ నంలోని నాల్గవ అంతస్తులో మంటలు ప్రారంబ óమయ్యాయి. ఒక్కసారిగా దట్టమైన పొగలు భవనాన్ని చుట్టుముట్టాయి. దీంతో లోపల ఉన్న సిబ్బంది ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మంటలు, పొగలు వ్యాపించడంతో ఉద్యోగులంతా భయంతో బయటికి పరుగులు తీశారు. అయినప్పటికీ ఇంకా చాలా మంది భవనంలో చిక్కుబడి పోయారని అనుమానిస్తున్నారు. ప్రమాదవార్త తెలిసిన వెంటనే నగరం నలుమూలల నుంచి 16 అగ్నిమాపక శకటాలు హుటాహుటిన సంఘట నాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నాయి. నావిక దళానికి చెందిన సిబ్బంది, తీవ్రవాద వ్యతిరేక యూనిట్‌ సభ్యులు హెలికాప్టర్ల ద్వారా సంఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నట్టు సహాయ పనుల శాఖమంత్రి పతంగరావు కదం చెప్పారు. ముఖ్యమైన పైళ్లు, రికార్డులన్నీ సురక్షితంగా ఉంటాయని భావిస్తున్నట్టు తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా ప్రమాద స్థలం పరిసరాలను పోలీసులు మూసివేశారు. పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగలు వ్యాపించడంతో ఊపిరాడక ఇద్దరు వ్యక్తులను ఆసుపత్రిలో చేర్చారు. మరికొందరు భవనంలోపల చిక్కుబడి ఉన్నారని అనుమానిస్తున్నారు. భవనంలోని నాల్గవ అంతస్తు కిటికిల్లో నుంచి దట్టమైన పొగలు బయటికి వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. మంటల తాకిడి క్రమంగా పెరుగుతూ ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న ఆరవ అంతస్తులోకి కూడా పాకాయి. అదృష్టవశాత్తు ఇప్పటివరకు ప్రాణనష్టం జరగలేదు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌్‌, ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాలు మంటలకు ఆహూతయ్యాయి. ఈ మంటలకు వారి కార్యాలయాల్లోని రికార్డులు కూడా దగ్ధమయ్యాయని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ముఖ్యమంత్రి చవాన్‌ తన కార్యాలయంలో లేరు.
ఈ అగ్నిప్రమాదంలో ఆదర్శ్‌ కుంభకోణానికి సంబంధించిన పైళ్లు, విలువైన రికార్డులు కూడా దగ్ధమయ్యాయని వార్తలు వచ్చాయి. అయితే సిబిఐ ఈ వార్తలను ఖండించింది. ఈ కుంభకోణానికి సంబంధించిన రికార్డులన్నీ తమ వద్ద భద్రంగా ఉన్నాయని సిబిఐ తెలిపింది. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే భవనం మొత్తం ఖాళీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. భవనం లోపల ఎవరైనా చిక్కుబడి ఉంటే వారిని సురక్షితంగా బయటకు తేవాలని సహాయక బృందాలను ఆదేశించారు.