మహాశక్తి ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

స్వర్ణకవచాలంకృతా దేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు

🔸 దీక్ష స్వీకరణకు తరలివచ్చిన అశేష భక్తులు

🔸మొదటి రోజు పూజలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) :
కరీంనగర్ లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. మొదటి రోజున శ్రీ స్వర్ణకవచాలంకృతా దేవి రూపంలో శ్రీ మహాదుర్గ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఉ: 9 గం.లకు స్వస్తి పుణ్యహవాచనము, గణపతి పూజ, మాతృక పూజ, నాంది, అంకురారోపణము, అఖండ దీపారాధనము, సర్వతోభద్రమండలము, మంత్ర పుష్పము తదితర కార్యక్రమాలు చేపట్టి తీర్థ ప్రసాద వితరణ చేశారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ఆలయంలో జరిగిన దేవీ నవరాత్రి ఉత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
దేవీ నవరాత్రి ఉత్సవాల మొదటి రోజు కావడంతో శ్రీ మహాశక్తి ఆలయంలోని అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి దీక్ష చేపట్టడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
సాయంత్రం 6 గం.లకు శ్రీ మహాదుర్గ అమ్మవారికి ఫలపంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం సాయంత్రం 7 గం.లకు శ్రీ గర్రెపల్లి మహేశ్వర శర్మ శ్రీ దేవి భాగవతం ప్రవచనం కార్యక్రమం జరిగింది. రాత్రి 9:30 ని.లకు దాండియా వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ మహాశక్తి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో, భక్తులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు.