మహిళ దారుణ హత్య
విజయవాడ, జూలై 26 : జిల్లా కేంద్రమైన మచిలిపట్నంలో ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. నడిరోడ్డుపైనే దుండగులు ఆమెను కత్తులతో పొడిచి చంపారు. గురువారం జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. గొడుగుపేటకు చెందిన యాదమ్మ అనే మహిళ కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తకు దూరంగా ఉంటూ విడిగా నివసిస్తోంది. ప్లాస్టిక్ ప్యాక్టరీలో పని చేస్తూ పొట్టపోసుకుంటుంది. ఈ నేపథ్యంలో గురువారం ఆమె ఉదయం షిప్ట్‌కు ప్యాక్టరీకి వెళ్లేందుకు బయలుదేరగా గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను అనుసరించి కత్తులతో పొడిచి పారిపోయారు. ఇంకా తెలవారకపోవడంతో, జనసంచారం అంత ఎక్కువ లేకపోవడం వారికి ఉపకరించింది. తదుపరి మార్నింగ్ వాక్కు వచ్చిన స్థానికులు రక్తపు మడుగులో పడి ఉన్న యాదమ్మను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఆసుపత్రికి తరలించే సరికే యాదమ్మ మృతి చెందింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణం నుండి దర్యాప్తు చేపట్టారు.