డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్

– నివాళులర్పించిన బిజెపి మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్

గన్నేరువరం, జూన్ 23 (జనంసాక్షి): డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ సందర్భంగా మంగళవారం గన్నేరువరం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు తిప్పర్తి నీకేష్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. తిప్పర్తి నికేశ్ మాట్లాడుతూ.. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, గొప్ప జాతీయవాది, విద్యావేత్త, దేశ సమైక్యత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కి బలిదాన దివస్ సందర్భంగా ఘన నివాళులు అర్పించమని అన్నారు. “ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు ప్రధానులు, రెండు జెండాలు ఉండవు” అనే దృఢ సంకల్పంతో జమ్మూ-కాశ్మీర్ సంపూర్ణ విలీనానికి ఆయన చేసిన పోరాటం భారత చరిత్రలో చిరస్మరణీయం. దేశ సమగ్రత, జాతీయ ఏకత్వం భారత మాత గౌరవం కోసం ఆయన చేసిన త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం. 1953 జూన్ 23న దేశ సమైక్యత కోసం పోరాడుతూ ఆయన చేసిన పరమ త్యాగం భారత జాతి ఎప్పటికీ మరువలేనిది. ఆయన ఆశయాలు, దేశభక్తి, సేవా తత్వం నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ సందర్భంగా వారికి శతకోటి వందనాలు. వారి త్యాగం, సేవలు ఎల్లప్పుడూ దేశ ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గన్నేరువరం 8వ వార్డు సభ్యులు మచ్చ సాయికృష్ణ,జిల్లా ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు మచ్చ బాలరాజు,మండల నాయకులు సందవేణి ప్రశాంత్, అటికం రామచంద్రం, మండల ప్రధాన కార్యదర్శులు పుల్లెల రాము, బొమ్మాడి సురేందర్ రెడ్డి, కుర్ర హరీష్ తదితరులు పాల్గొన్నారు.