రేపు హైదరాబాద్‌లో ఉప సర్పంచ్‌ల మహాసభ – హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు రావాలి: అయినాల శ్రీకాంత్

సిరికొండ జూన్ 24 (జనం సాక్షి): ఉప సర్పంచ్‌ల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25వ తేదీ గురువారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద గల ధర్నా చౌక్‌లో నిర్వహించనున్న ఉప సర్పంచ్‌ల భారీ బహిరంగ సభకు సిరికొండ మండలంలోని ఉప సర్పంచ్‌లందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని సిరికొండ మండల ఉప సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షులు అయినాల శ్రీకాంత్ పిలుపునిచ్చారు.బుధవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధిలో ఉప సర్పంచ్‌లు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి తగిన గుర్తింపు, అధికారాలు, సౌకర్యాలు అందడం లేదన్నారు. ఉప సర్పంచ్‌ల చెక్ పవర్‌పై వస్తున్న ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఖండించి, వారి హక్కులను పరిరక్షించేలా స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఉప సర్పంచ్‌లకు నెలకు రూ.5,000 గౌరవ వేతనం ప్రకటించాలని, అలాగే గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు నెలకు రూ.3,000 గౌరవ వేతనం అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. గ్రామ పంచాయతీల బలోపేతానికి ప్రజాప్రతినిధుల సంక్షేమం కూడా అవసరమని పేర్కొన్నారు.ఉప సర్పంచ్‌ల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ మహాసభను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఉప సర్పంచ్‌పై ఉందన్నారు. సిరికొండ మండలంలోని ప్రతి ఉప సర్పంచ్ తప్పనిసరిగా హాజరై ఐక్యతను చాటాలని, తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు సంఘీభావం ప్రకటించాలని పిలుపునిచ్చారు.ఈ మహాసభ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉప సర్పంచ్‌ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించేందుకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు.



