నిమిషాల్లోనే కనుమరుగవుతున్న టీటీడీ టికెట్లు

ప్రశ్నార్థకమవుతున్న ఆన్‌లైన్ బుకింగ్ విధానం
ముందస్తు రిమైండర్ పేరుతో నిరీక్షణ
జడ్చర్ల, జూన్ 24 (జనంసాక్షి): తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి స్పెషల్ ఎంట్రీ దర్శనం (రూ. 300) టికెట్ల బుకింగ్ ప్రక్రియ భక్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. బుధవారం ఉదయం 10 గంటలకు టికెట్లు విడుదలైన సమయం నుండి భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కేవలం సర్వర్ సమస్య మాత్రమే కాకుండా, బుకింగ్ వెబ్‌సైట్ అనుసరిస్తున్న తీరుపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ముందస్తు రిమైండర్ పేరుతో నిరీక్షణ:టికెట్ బుక్ చేసుకోవాలని వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే, “ఏడు నిమిషాల రిమైండర్” అంటూ సిస్టమ్ భక్తులను వేచి ఉండేలా చేస్తోంది. అసలు సమస్య ఇక్కడే మొదలవుతోంది. టికెట్ బుక్ చేసుకునే ముందు వేస్తున్న ఈ రిమైండర్, భక్తులను టికెట్ బుక్ చేసుకోకుండా అడ్డుకుంటున్నట్లుగా ఉందని ఆరోపిస్తున్నారు. ఏడు నిమిషాల రిమైండర్ ముగిసేలోపు టికెట్లు అన్నీ అయిపోవడం, ఆ తర్వాత ప్రయత్నిస్తే ఈ స్లాట్ బుక్ అయింది, వేరేది ఎంచుకోండి అని వెబ్‌సైట్ సూచించడం భక్తులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
ప్రశ్నార్థకమవుతున్న ఆన్‌లైన్ బుకింగ్ విధానం:టికెట్లు ఓపెన్ అయిన వెంటనే రిమైండర్ వేసి ఏడు నిమిషాలు ఎందుకు ఆపుతున్నారు? ఈ ఏడు నిమిషాల నిరీక్షణే టికెట్లు దక్కకుండా చేస్తోంది” అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని భక్తులు సైతం ఈ ఆన్‌లైన్ ప్రక్రియతో చుక్కలు చూస్తున్నారు. ఒక్క 5, 6 నిమిషాల వ్యవధిలోనే టికెట్లు అన్నీ ఎలా బుక్ అవుతున్నాయని, ఇందులో జరుగుతున్న సాంకేతిక లోపాలను టీటీడీ యాజమాన్యం ఎందుకు గమనించడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.
అధికారులు స్పందించాలి:సామాన్య భక్తులకు స్వామి వారి దర్శనం సులభతరం చేయాల్సిన బాధ్యత టీటీడీపై ఉందని భక్తులు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా దేవస్థానం అధికారులు స్పందించి, టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌లో ఉన్న సాంకేతిక లోపాలను సరిదిద్దాలని, భక్తుల సమయాన్ని వృథా చేసే ఈ రిమైండర్ పద్ధతిని రద్దు చేయాలని కోరుతున్నారు. పారదర్శకమైన, సులభమైన బుకింగ్ విధానాన్ని అమలు చేసి శ్రీ వేంకటేశ్వరుని దర్శన భాగ్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.



