-మాభూములు మాకు కావాల్సిందే.
-మెడికల్ కళాశాల భూ నిర్వాసితులు.
-పేదల భూములపై కన్నేసిన ఎంఎల్ఏ.
-పేదల వ్యతిరేక ప్రభుత్వాలను గద్దే దించే వరకు పోరాడుతాం.
-బి ఎస్ పి జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్లి కుమార్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగస్టు 22 (జనంసాక్షి):
మా భూములు మాకు కావాల్సిందేనని మెడికల్ కళాశాల భూ నిర్వాసితులు సోమవారం బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా మెడికల్ కళాశాల భూ నిర్వాసితులు మాట్లాడుతూ గతంలో మంత్రిగా ఉన్న మహేందర్ నాథ్ వ్యవసాయం చేసుకునేందుకు భూములను పంచగా ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తమ భూములపై కన్ను వేసి మెడికల్ కళాశాల నిర్మాణం కోసం తమ భూములను మాయ మాటలు చెప్పి స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో భూమికి భూమి ఇస్తామని ఉద్యోగం కల్పిస్తామని నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చి నేడు అమలు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు.తమ భూములను తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బిఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్లి కుమార్, కార్యదర్శి రాంచందర్ ల తో పాటుపటు పలువురు నేతలు ప్రసంగించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం దళిత బడుగు మైనార్టీలకు చెందిన భూములపై కన్ను వేసి సంక్షేమ పథకాల ముసుగులో వాటిని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని విమర్శించారు. జిల్లా కేంద్రంలో అనేక ప్రాంతాలలో ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ ఉయ్యాలవాడ శివారులోని అధికార పార్టీ అనుచరుల భూములకు డిమాండ్ తీసుకువచ్చేందుకు స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి మెడికల్ కళాశాలను ఉయ్యాలవాడ శివారుకు మార్పించి భూ నిర్వాసితులను మోసం చేసి భూములను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. భూసేకరణ ఒక పద్ధతి ప్రకారం నిబంధనలను పాటించకుండా స్థానిక ఎమ్మెల్యే దోపిడీదారులుగా మారి పేదల భూములను స్వాధీనం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు బలగాలతో భయాందోళనకు గురిచేసి అధికార పార్టీ నేతలు భూనిర్వాసితులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. వారి భూములు వారికి దక్కేవరకువారి పక్షాన బీఎస్పీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. నిర్వాసిత స్థలంలోని వంటలు వండి సేద్యం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఎస్సీ బీసీ మైనార్టీ భూములు మాత్రమే ఉన్నాయా అని ప్రశ్నించారు. పేదలకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలను గద్దే దించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.ఉయ్యాలవాడ భూ నిర్వాసితుల పక్షాన విపక్ష పార్టీలు ప్రజా సంఘాలు పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. అధికార పార్టీ నేతలు భూభకాసులుగా భూకబ్జాదారులుగా నల్లమట్టి మరియు ఇసుక మాఫియాగా మారి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందని ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఎమ్మెల్యే ఆదేశాలకు తలోగ్గి ఎంపీ మరియు జిల్లా పరిషత్ చైర్మన్ దళితుల పక్షాన నిలవడం లేదని ఆరోపించారు.పోరాటాలు ఉధృతం చేసి బాధితులకు న్యాయం చేసే వరకు వివిధ రూపాలలో పోరాటాలు చేస్తామని అన్నారు.కార్యక్రమంలో తాలూకా అధ్యక్షులు పృథ్వీరాజ్,మెడికల్ కళాశాల భూ నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు.