మోదీ సర్కారుకు చెంపదెబ్బ

C

– అరుణాచల్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ

– రాష్ట్రపతి పాలన చెల్లదు

– గవర్నర్‌ అత్యుత్సాహంపై మొట్టికాయ

– ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రపతి జోక్యం చేసుకోవచ్చు

– సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు

న్యూఢిల్లీ,జులై 13(జనంసాక్షి): అరుణాచల్‌ ప్రదేశ్‌ వ్యవహారంలో భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని దెబ్బతీయాలన్న ప్రయత్నాలలపై సుప్రీం కొరడా ఝళిపించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ సంక్షోభంపై సుప్రీంకోర్టు బుధవారం చరిత్రాత్మక తీర్పును ఇచ్చింది. రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉత్తరాఖండ్‌ అంశం తర్వాత మరోసారి కాంగ్రెస్‌ విజయం సాధించింది. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం కారణంగా జనవరి 26న రాష్ట్రపతి పాలన విధించగా.. తర్వాత కాంగ్రెస్‌ తిరుగుబాట నేత కలిఖో పుల్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ విషయంలో గవర్నర్‌ జ్యోతిప్రసాద్‌ నిర్ణయం రాజ్యాంగ సమ్మతం కాదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. 2015 డిసెంబరు ముందు నాటి పరిస్థితిని పునరుద్ధరించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. గవర్నర్‌ను అనుసరిస్తూ గత డిసెంబరు 9న తీసుకున్న నిర్ణయాలు న్యాయ సమ్మతం కావని తెలిపింది. ఆ రాష్ట్ర గవర్నర్‌ ఇచ్చిన ఆదేశాలన్నింటినీ  న్యాయస్థానం రద్దు చేసింది. అసెంబ్లీ సమావేశాల తేదీని ముందుకు జరుపుతూ…. గవర్నర్‌ తీసుకున్న నిర్ణయం న్యాయసమ్మతం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. డిసెంబర్‌ 15, 2015 నాటి యథాతథ పరిస్థితి ఉండాలని సూచించింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం తిరిగి పునరుద్ధరణకు ఆదేశాలు ఇచ్చింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో నబమ్‌ టుకీ మళ్లీ ముఖ్యమంత్రి పదవిలో కూర్చునేందుకు మార్గం సుగమమైంది. కాగా 60 మంది సభ్యులున్న అరుణాచల్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 47 మంది సభ్యులుండగా.. అసమ్మతి నేత కాలిఖోపుల్‌ సారథ్యంలో 21 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయటం తెలిసిందే. నబమ్‌ టుకీ సీఎంగా గల ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్ర సభ్యులు మద్దతిచ్చారు. నాటకీయ పరిణామాల్లో రాష్ట్రపతి పాలన విధించారు. దీనిపై కాంగ్రెస్‌ నేతలు ‘సుప్రీం’ను ఆశ్రయించగా.. గవర్నర్‌ విచక్షణాధికారాల పరిధిపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెల్లడించారు. మరోవైపు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కాంగ్రెస్‌ పార్టీ స్వాగతించింది. ఇది ప్రజాస్వామ విజయమని ఆ పార్టీ అభివర్ణించింది. వివరాల్లోకి వెళితే…కాంగ్రెస్‌ అధికారంలో అరుణాచల్‌లో కలిఖో పుల్‌ నేతృత్వంలోని 21 మంది.. అప్పుడు సీఎంగా ఉన్న నబమ్‌ తుకిపై తిరుగుబాటు చేశారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. జనవరి 26న రాష్ట్రపతి పాలన విధించారు. అయితే ఈ పరిణామాలపై కాంగ్రెస్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. విచారణ జరుగుతుండగానే కలిఖో పుల్‌ నేతృత్వంలోని ఎమ్మెల్యేలు, భాజపా సభ్యులు గవర్నర్‌ను కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో అరుణాచల్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలని ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుని.. రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. దీంతో రాష్ట్రపతి పాలన ఎత్తేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ విజ్ఞప్తి మేరకు రాష్ట్రంలో యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాగా.. మరుసటి రోజు కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ వేసిన అనర్హత వేటుపై గౌహతి హైకోర్టు స్టే విధించడంతో సుప్రీంకోర్టు తన ‘యథాతథ’ ఉత్తర్వులను తొలగించింది. దీంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. దీంతో పుల్‌ ఫిబ్రవరిలో అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అరుణాచల్‌ రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని  తీర్పు చెప్పడంతో తిరిగి నబమ్‌ టుకి ప్రభుత్వం ఏర్పాటు కానుంది. కోర్టు తీర్పుపై టుకి సంతోషం వ్యక్తంచేశారు. ఇది ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు. మొదటి నుంచి తమకు సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందని నమ్మకం ఉందని, చివరికి తమకు న్యాయం జరిగిందన్నారు. ఇటీవల ఉత్తరాఖండ్‌ రాజకీయ సంక్షోభంలో కాంగ్రెస్‌ బలాన్ని నిరూపించుకుని హరీష్‌రావత్‌ తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

అరుణాచల్‌ తీర్పుపై రాహుల్‌ ఆనందం
అరుణాచల్‌ ప్రదేశ్‌లో తిరిగి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆనందం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో నబమ్‌ తుకి ప్రభుత్వం ఏర్పాటుకు ఆదేశించినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు చేస్తూ ట్వీట్లు చేశారు. మోదీకి ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలియజేసినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు అని రాహుల్‌ పోస్ట్‌ చేశారు. కావాలనే ఇలా ఎన్నికయిన ప్రభుత్వాలను కూలదోసే చర్యలు మానుకోవాలని హెచ్చిరంచారు. ఇప్పటికైనా మోదీ చట్టపరంగా ఎన్నికైన ప్రభుత్వాల్లో జోక్యం చేసుకోవడం ఆపేస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.