రాయల తెలంగాణ ముచ్చటే లేదు

శ్రీఅమరుల త్యాగాలను అవమానించొద్దు ,
శ్రీగండ్ర వెంకటరమణారెడ్డి సీమకు తాబేదారు ,
శ్రీకాంగ్రెసోళ్ల దిష్టిబొమ్మలు దహనం చేయుండ్రి ,
శ్రీమళ్లీ ఉధృతంగా ఉద్యమం ,
జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌
హైదరాబాద్‌, జూన్‌ 28 (జనంసాక్షి): రాయల తెలంగాణ ప్రతిపాదనను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునే ప్రసక్తిలేదని, దానిని తిరస్కరిస్తామని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం స్పష్టం చేశారు. గురువారం జరిగిన జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు అనుకూలంగా సంకేతాలు కేంద్రం వెలువరిస్తున్న సందర్భంలో ఇటువంటి అర్థంలేని ప్రతిపాదనలతో ప్రజలను అయోమయం చేసేందుకు ప్రయత్నించడం శోచనీయమన్నారు. తెలంగాణ కాంగ్రెసనాయకులు సీమాంధ్ర నేతల తొత్తులుగా మారి వారే ఇటువంటి ప్రతిపాదనలు తేవడం అమానుషమని, అనాగరికమని ఆయన మండిపడ్డారు. రాయల తెలంగాణ ప్రతిపాదనతో మాట్లాడుతున్న తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి వ్యాఖ్యలపై కోదండరాం తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నవారు రాయల తెలంగాణ కోసం చేసుకోలేదని వారు బలిదానాలను, త్యాగాలను అపహాస్యం చేయవద్దని ఆయన హెచ్చరించారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణను ఏర్పాటు చేయాల్సిందేనని ఆయన డిమాండ్‌ చేశారు.. నల్లగొండ, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాలతో కూడిన తెలంగాణనే కావాలని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ ఉధృతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని, ఉద్యమ కార్యాచరణను చర్చించేందుకు వచ్చే నెల 7న జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు.