రైతులను విస్మరించిన ప్రభుత్వం : వి.జి.గౌడ్‌

నిజామాబాద్‌, జూలై 19 : రైతాంగాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, అందులో భాగంగా వ్యవసాయానికి అందించాల్సిన ఉచిత విద్యుత్‌ను అటకెక్కించేందుకు యత్నిస్తుందని టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వి.జి.గౌడ్‌ దుయ్యబట్టారు. టిడిపి కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం తలెత్తిందని దాంతో ప్రాజెక్టుల్లో నీరు లేక బోసిపోతున్నాయన్నారు. రైతులు వరి నాట్లు వేసినా సాగునీరు లేక ఎండిపోతున్నాయన్నారు. ప్రాజెక్టుల్లో నీరు లేక విద్యుత్‌ కోతలను ప్రభుత్వం విధిస్తుందని, దాంతో గృహావసరాలకు, వ్యాపార వాణిజ్య సముదాయాలు తీవ్రంగా నష్టపోతున్నాయన్నారు. పరిశ్రమలకు మూడు రోజుల పాటు కరెంట్‌ సరఫరాను నిలిపివేయడంతో పరిశ్రమలు మూతపడేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. విద్యుత్‌ ఉత్పత్తిలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకుండా విద్యుత్‌ కోతలను విధించడం సమంజసం కాదన్నారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. ఖరీఫ్‌ ప్రారంభమై 45 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ఎరువులు, విత్తనాలను అందించలేకపోయిందన్నారు. ఉచిత విద్యుత్‌ను అందిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఏడు గంటల విద్యుత్‌ను కూడా అందించలేకపోతుందన్నారు. రైతులకు కేవలం మూడు, నాలుగు గంటలే విద్యుత్‌ను అందించడం వల్ల పంటలు ఎండిపోతున్నాయన్నారు. టిడిపి హయాంలో రైతులకు అనేక సంస్కరణలను చేపట్టడం జరిగిందని, దాని మూలంగానే ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు ఉచితంగా విద్యుత్‌ అందిస్తుందన్నారు. రైతాంగానికి వడ్డీ లేని రుణాలను అందిస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం, ఇప్పటి వరకు ఏ ఒక్కరికీ వడ్డీ లేని రుణాలను అందించలేదన్నారు. డ్వాక్రా సంఘాలను కూడా టిడిపియే బలోపేతం చేసిందని, ఇందులో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. డ్వాక్రా మహిళలకు చాలా మట్టుకు పావలా వడ్డీ రుణాలు అందడం లేదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులను చేపట్టడమే కాకుండా రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు ఆకుల శంకర్‌, రాజమల్లు, నరేందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.