రోడ్డెక్కిన డాక్టర్లు. నిలిచిపోయిన వైద్యసేవలు

సమ్మెలో పాల్గొన్న 25 వేల మంది వైద్యులు
నగరంలో భారీ ర్యాలీ
హైదరాబాద్‌, జూన్‌ 25 :
ఐఎంఎ పిలుపునకు ‘అప్న’ కూడా మద్దతు ప్రకటించింది. ఐఎంఎ సభ్యత్వం కలిగి ఉన్న ప్రభుత్వ వైద్యులు, మెడికల్‌ కళాశాలల వైద్యులు దాదాపు 25వేల మంది సోమవారం సమ్మెలో పాల్గొన్నారు. ఇటీల కేంద్ర ప్రభుత్వం స్థలం, మౌలిక సదుపాయలు, పరికరాలు, పారా మెడికల్‌, నర్సింగ్‌ సిబ్బంది విషయంలో కఠిన నిబంధనలను తెచ్చింది. దీనిని ఐఎంఎ వ్యతిరేకించింది. ఎంసీఐని  పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను వైద్యుల హక్కులను కాలరాసే విధంగా రూపొందించిన ఎంసీహెచ్‌ఆర్‌ హెచ్‌ బిల్లును వెంటనే వెనుక్కు తీసుకోవాలని , సమ్మెలో పాల్గొన్న వైద్యులు డిమాండ్‌ చేశారు. వైద్య సేవల బంద్‌ను విజయవంతం చేసిందుకు ఐఎంఎ ప్రతినిధులు డాక్టర్‌ అప్పారావు, డాక్టర్‌ జీఎస్‌వి ప్రసాద్‌లు కృతజ్ఞతలు తెలిపారు.కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త వైద్య విధానంతో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యుల హక్కులకు భంగం కలిగుతుందని ఆరోపించారు. ఒక్క రోజు వైద్య సేవల బహిష్కరణలో భాగంగా రాష్ట్రంలోని దాదాపు అన్ని కార్పొరేట్‌ వైద్య శాలలు మినహా మిగిలిన అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు ఐఎంఎలో సభ్యత్వం ఉన్న వైద్యులు పాల్గొన్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీలు నిర్వహించడంతో పాటు జిల్లా స్థాయిలో అధికారులకు వినతి పత్రం కూడా సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లును వెనుక్కు తీసుకునే వరకు తాము విడతల వారీగా ఆందోళనలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.