కాళేశ్వరం కమిషన్ ఏర్పాటులో దురుద్దేశం లేదు
` హైకోర్టుకు వివరించిన తెలంగాణ ప్రభుత్వం
` అవతకవకలు, డబ్బు దుర్వినియోగంపైనే దష్టి
` తదుపరి విచారణ 12కు వాయిదా వేసిన కోర్టు
హైదరాబాద్(జనంసాక్షి): కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్ ఏర్పాటు వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ ఎ. సుదర్శన్ రెడ్డి హైకోర్టుకు స్పష్టం చేశారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రజాధనం దుర్వినియోగమైందని తెలిపారు. ఎవరినో టార్గెట్ చేసేందుకు జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ ఏర్పాటు చేయలేదని హైకోర్టు దష్టికి తీసుకు వెళ్లారు. గురువారం కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్ ఏర్పాటు.. అందించిన నివేదికపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ సందర్భంగా ఏజీ, పిటిషనర్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. కమిషన్ నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటారని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని స్పష్టం చేశారు. కాళేశ్వరం నిర్మాణంలో అధికార దుర్వినియోగం జరిగిందని హైకోర్టుకు ఏజీ వెల్లడించారు. ఇక పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. పలువురిపై కమిషన్ తప్ప్పుడు అభియోగాలు నమోదు చేసిందన్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో బిజినెస్ రూల్స్ ఎక్కడా ఉల్లంఘించ లేదని స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టినట్లు పిటిషనర్ తరుఫు న్యాయవాది కోర్టు దష్టికి తీసుకెళ్లారు. కేసీఆర్‌ను సాక్షిగా పిలిచి దోషిగా ఆరోపణలు చేయడం సరికాదంటూ న్యాయవాది తన వాదనలు వినిపించారు. తప్ప్పుడు విధానంలో కమిషన్ నోటీసులు ఇచ్చిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ స్థల మార్పిడి, ప్రాజెక్ట్ ఖర్చు అంచనాతోపాటు నిర్మాణ సంస్థలకు ఇవ్వడంలో ఎవరు లబ్ది పొందలేదన్నారు. ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక చెల్లదని.. దీనిపై స్టే ఇవ్వాలని హైకోర్టును పిటిషనర్ న్యాయవాది కోరారు. ఈ వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణ మార్చి 12వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.


