ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలి


కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి, మార్చ్ 07(జనంసాక్షి ):రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణను ఉమ్మడి జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలుపై ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, శాసనసభ్యులు పాయల శంకర్, అనిల్ జాదవ్, వెడ్న బజ్జు, అదిలాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ అనూష, అదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అనిల్ మహాజన్, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొమరం భాయ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ పనులను వేగవంతం చేయాలని, భూ సేకరణ పై ప్రత్యేక దృష్టి సారించాలని, మరమ్మత్తులు ఏవైనా ఉంటే వెంటనే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టకు సాగునీరు అందించాలని తెలిపారు. వేసవికాలంలో త్రాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని, సి ఎం ఆర్ వ్యవహారంలో మిల్లర్ల నుంచి ధాన్యం రికవరీ కేసుల పురోగతి వంటి అంశాలపై ఏప్రిల్ 30 నాటికి సమగ్ర నివేదిక అందించాలని తెలిపారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జాబితాను ఆధార్, బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేయాలని, ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని, మాధకుద్రవ్యాలపై ఉక్కు పాదం మోపాలని, ఇసుక అక్రమ రవాణా, మైనింగ్ పై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధి దిశగా అనేక చర్యలు చేపడుతుందని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంపొందించాలని, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక, అమలుకు సాంకేతికతను వినియోగించుకోవాలని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను 10 నుండి 15 రోజుల్లో పరిష్కరించాలని, అధికారుల తమ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, వారి పరిధిలో లేని సమస్యలను ఉన్నతాధికారులకు సిఫారసు చేయాలని, దీనితో బాధితులకు సకాలంలో సాంత్వన లభిస్తుందని తెలిపారు. సంక్షేమ పథకాలతో పాటు, కుల, నివాస, ఇతర ఆర్జీలను నిబంధనలకు లోబడి పరిశీలించి సకాలంలో ఆన్లైన్ లో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాసర సరస్వతి ఆలయంలో అన్ని సేవలను ఆన్లైన్ లో అందుబాటులో తేవాలని, బాసర ఐఐఐటి లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా, ప్రజా ప్రభుత్వ లక్ష్యాల సాధనకు అధికారులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. జిల్లాలలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచి ప్రజలకు ప్రభుత్వ సేవలు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత రెండు సంవత్సరాల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా అధికారులు కృషి చేయాలని తెలిపారు. పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేసే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెంచాలని అన్నారు. జిల్లాలలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్ ఫైళ్ల వేగవంతమైన పరిష్కారం, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు, రోడ్ల భద్రత, సురక్షిత ప్రయాణానికి చర్యలు, సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చేరేలా పర్యవేక్షణ, పిల్లల భద్రత, డ్రగ్స్ నిరోధక అవగాహన కార్యక్రమాలు, విద్య, యువత క్రీడల అభివృద్ధి, మహిళల సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయిలో సమన్వయంతో ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ ఫలితాలు కనిపించేలా పనిచేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం నుండి జిల్లా కలెక్టర్ కె హరిత, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని జిల్లాలో అధికారుల సమన్వయంతో సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.