లోతట్టు ప్రాంతాల్లో ముంచేత్తిన వరదలు- పోలీసుల సహాయక చర్యలు.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జులై27. (జనంసాక్షి). ప్రకృతి ప్రకోపానికి సిరిసిల్ల తడిసి ముద్దయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కాగా సిరిసిల్ల పట్టణంలోని అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ప్రధాన కాలువ ఉధర వాగు పొంగి ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలైన అశోక్ నగర్, అనంత నగర్, సర్దార్ నగర్ తో పాటు వెంకన్నపేటలోని అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరోవైపు వంశీకృష్ణ నగర్ కాలనీ తో పాటు సిరిసిల్ల పాత బస్టాండ్ అనేక ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంబిక నగర్ పద్మనగర్ ప్రజలకు ప్రధాన రహదారులను కలుపుతూ ఉన్న ఉదార వాగు అధికారులు చేపట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో వరదనీరు కాలువ పైనుండి ప్రవహించడంతో కల్వర్టులన్నీ వరద నీటిలో మునిగిపోవడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అధికారులు పోలీస్ శాఖ, ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేయడంతో వరదలు చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒకవైపు వరద ఉధృతి మరోవైపు వానలు కురుస్తుండడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లడిస్తున్న పరిస్థితి ఉన్నది.