వికలాంగులకు ట్రై సైకిళ్లు

విజయనగరం, జూలై 16: జిల్లాలో వికలాంగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం పని చేస్తుందని విజయనగరం పార్లమెంట్‌ సభ్యురాలు ఝన్సీలక్ష్మి అన్నారు. సోమవారం జిల్లా పరిషత్‌ ప్రాంగణంలో వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో ఆమె 95 మంది వికలాంగులకు 5.70 లక్షల విలువ చేసే ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. అదేవిధంగా 103 మంది వికలాంగులకు 4.79 లక్షల విలువ చేసే వినికిడి యంత్రాలను అందించారు. అంతేకాక వికలాంగులను వివాహం చేసుకున్న 102 మంది 10.20 లక్షల రూపాయల నగదు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ జిల్లాలో వికలాంగులకు జిల్లా పరిషత్‌ నిధులలో మూడు శాతం వాటాను మినహాయించి వారికి వివిధ రకాల ప్రోత్సాహకాలను అందిస్తున్నట్ల్లు తెలిపారు. కార్యక్రమంలో వికలాంగులు, వయోవృద్ధుల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అచ్యుతరావు, తదితరులు పాల్గొన్నారు.