విద్యుత్‌ కోతలతో అవస్థలు

విజయనగరం, జూలై 13  జిల్లాలో విద్యుత్‌ సరఫరా అస్తవ్యస్తంగా మారింది. ఎప్పుడు విద్యుత్‌ ఉంటుందో ఎప్పుడు ఆగిపోతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో వినియోగదారులు తల్లడిల్లుతున్నారు. అధికారిక విద్యుత్‌ కోతలతో పాటు ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌(ఇఎల్‌ఆర్‌) పేరిట అనధికారిక విద్యుత్‌ కోతలు అమలు అవుతున్నాయి. జిల్లా కేంద్రంలోనే విద్యుత్‌ కష్టాలకు ఇప్పట్లో విముక్తి కలిగే అవకాశాలు కనుచూపుమేరలో కానరావడంలేదు. ఎడాపెడా విద్యుత్‌ కోతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గురువారం నుంచి విద్యుత్‌ కోతల వేళలను మరింత పెంచారు. బుధవారం వరకు జిల్లా కేంద్రంలో మూడు గంటలు ఉండే విద్యుత్‌ కోతను 5 గంటలకు పొడిగించారు. మున్సిపల్‌, మండల కేంద్రాల్లో అమలయ్యే 4 గంటల విద్యుత్‌ కోతను 6 గంటలకు పెంచారు. గ్రామీణ ప్రాంతాల్లో 6 గంటల పాటు ఉండే విద్యుత్‌ కోతను 8 గంటలకు పెంచారు. మారిన విద్యుత్‌ కోతల వేళలకు సంబంధించి ఆ శాఖ అధికారులు తాజా ఉత్తర్వులు జారీ చేశారు. అధికారిక విద్యుత్‌ కోతలతో పాటు జిల్లా కేంద్రం, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో అదనంగా రోజుకు 3 నుంచి 5 గంటల పాటు అమలు చేస్తున్నారు. అన్ని రంగాలకు కలుపుకుని రోజుకు 3,921 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం జిల్లాలో జరుగుతోంది. జిల్లాకు వచ్చే విద్యుత్‌ కేటాయింపు మాత్రం 3184 మిలియన్‌ యూనిట్లు మాత్రమే. దీంతో రోజుకు 737 మిలియన్‌ యూనిట్లు లోటు వస్తోంది. ఈ పరిస్థితుల్లో విద్యుత్‌ కోతలు అనివార్యంగా మారాయి. జిల్లా కేంద్రంలో ఉదయం ఆరు గంటల నుంచి 8.30 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 2.30 గంటల వరకు విద్యుత్‌కోత అమలు అయింది. మున్సిపాలిటీ కేంద్రాలలో ఉదయం 7.30 నుంచి 10.30 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి 4.30 గంటల వరకు విద్యుత్‌ కోత అమలు అవుతోంది. మండల కేంద్రాల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు, గ్రామీణ ప్రాంతాలలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్‌ కోత అమలులో ఉంది. ఇవి కాకుండా రాత్రి వేళల్లో ఎడాపెడా విద్యుత్‌ కోతలను అనధికారికంగా అమలు చేస్తున్నారు. ఒక వైపు వేసవి ఎండలను తలపించే విధంగా ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఉక్కపోతలతో ప్రజలు అలమటిస్తున్నారు. పరిశ్రమలకు వారానికి మూడు రోజులు పవర్‌ హాలీడే అమలు జరుగుతుంది. సోమ, మంగళ, బుధవారాల్లో పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నారు. చిన్న తరహా పరిశ్రమలకు సోమ, మంగళవారాల్లో రెండు రోజుల పాటు పవర్‌ హాలీడే అమలు అవుతోంది. విద్యుత్‌ ఆధారంగా నడిచే పలు చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమల యజమానులు విద్యుత్‌ కోతతో పనులు చేయలేక తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు విద్యుత్‌ కోత కారణంగా కూలి డబ్బులు సైతం అందని పరిస్థితులు నెలకొన్నాయి. భవిష్యత్తులో విద్యుత్‌ కోతల తీవ్రతతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.