విద్యుత్‌ కోతల్లోనూ తెలంగాణకు అన్యాయం

జేఏసీ చైర్మన్‌ కోదండరాం
హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) :
విద్యుత్‌ కోతల్లోనూ తెలంగాణకు పాలకులు అన్యాయం చేస్తున్నారని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రైవేట్‌ సెక్టార్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో భూమి పుత్రుల మహాపాదయాత్ర పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ రైతులకు 7 గంటల ఉచిత కరెంటు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇవ్వకుండా మోసం చేస్తున్నదని ఆరోపించారు. పరిశ్రమల విషయంలో సీమాంధ్ర కన్నా తెలంగాణలోనే ఎక్కువ శాతం కోతలు విధిస్తున్నదని, ఫలితంగా నిత్యం వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సీమాంధ్రకు మాత్రం కోతల్లో కోత విధిస్తూ తెలంగాణపై తనకున్న వివక్షను చాటుతున్నదన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా తెలంగాణకు విద్యుత్‌ కోత అధికంగా జరుగుతున్న విషయంపై ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం లేదని, అందుకే పాలకులు తమ ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా స్థానిక నాయకులు పరిశ్రమలకు కూడా నిరంతరం 7 గంటల విద్యుత్‌ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ పరిశ్రమ యాజమాన్యం, కార్మికులు సెప్టెంబర్‌ 30న జరిగే తెలంగాణ మార్చ్‌కు భారీగా తరలివచ్చి తమ ప్రత్యేక రాష్ట్ర సాధన ఆకాంక్షను చాటాలని పిలుపునిచ్చారు.