తప్పిన పెనుముప్ప్పు

` మైత్రీవనం కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం
` సకాలంలో ఫైర్ సిబ్బంది రాకతో తప్పిన ప్రమాదం
` ఎల్బీనగర్ చట్నీస్‌లో పేలుడు.. ముగ్గురు సిబ్బందికి గాయాలు
హైదరాబాద్(జనంసాక్షి):అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తాలోని ఆదిత్య ఎన్‌క్లేవ్ భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కాంప్లెక్స్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో పలువురు విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. నిచ్చెన సాయంతో 60 మందిని కిందికి దించారు. నీలగిరి బ్లాక్‌లోని షాపులను మూసివేయించారు. కోచింగ్ సెంటర్‌లోని విద్యార్థులను పంపించారు. గ్రౌండ్ ప్లోర్‌లోని ప్యానెల్ బోర్డులో షార్ట్‌సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మూడు అంతస్తుల వరకు మంటలు వ్యాపించినట్లు పోలీసులు తెలిపారు. పై అంతస్తులోని కొన్ని ఐటీ సంస్థల్లో ఉన్న కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు మెట్ల మార్గం ద్వారా బయటకు వచ్చారు. మరికొందరిని అగ్నిమాపక సిబ్బంది బాల్కనీ ద్వారా, మెట్ల ద్వారా సురక్షితంగా కిందకు చేర్చారు. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. కొందరు కిందకు దూకేందుకు ప్రయత్నించగా వారిని అగ్నిమాపక సిబ్బంది కాపాడింది.
ఎల్బీనగర్ చట్నీస్‌లో పేలుడు
ఎల్బీనగర్‌లోని ఆర్కేపురం చట్నీస్ హోటల్‌లో పేలుడు సంభవించింది. భారీ శబ్దానికి వినియోగదారులు పరుగులు తీశారు. ఈ ఘటనలో ముగ్గురు హోటల్ సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇడ్లీ స్టీమర్‌లో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న ఎల్బీనగర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అధిక వేడిమి కారణంగానే స్టీమర్ పేలిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పోలీసులు, హైడ్రా సిబ్బంది, బాంబు స్క్వాడ్ బందాలు పేలుడు సంభవించిన కిచెన్‌ను పరిశీలించాయి. ఇడ్లీ స్టీమర్ వేడెక్కడంతోనే పేలుడు సంభవించిందా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.