వీళ్లు నోరు తెరిస్తే అబద్ధాలే !

‘ఇల్లు కాలి ఒకడేడిస్తే.. ఇంకేదో కాలి మరొకడేడ్చిండు..’ అన్నట్లు ఉంటది సీమాంధ్ర నాయకుల తీరు. ఇట్ల నోరు పిచ్చి పిచ్చిగా మాట్లాడే ఆ నాయకులను ఓ తరగతిలో కూర్చోబెట్టి, ఎవరెక్కువగా పనికి రాని, ప్రస్తుత పరిస్థితులతో సంబంధం లేని విషయాలను మాట్లాడుతారో వారికి బహుమానం ఇస్తామంటే.. ఆ క్లాస్‌ ఫస్ట్‌ అబ్బాయి ఎవరొస్తారో తెలుసా ? ఇంకెవరు.. ‘బెజవాడ బుల్లోడు’ లడగపాటి రాజగోపాల్‌రెడ్డి ! మరి అతనికి గట్టి పోటీ ఇస్తూ రెండో స్థానంలో టీజీ వెంకటేశ్‌, మూడో స్థానంలో పరకాల ప్రభాకర్‌ ఉంటారు. వాస్తవ పరిస్థితులు ఒకలా ఉంటే, దానికి పూర్తిగా వ్యతిరేకంగా వాదించే వితండవాదం ఈ ముగ్గురిది. నోరు తెరిస్తే చాలు.. తెలంగాణ గురించి అబద్ధాలు మాట్లాడడంలో వీళ్లు దిట్ట ! మొన్న క్లాస్‌ అబ్బాయి లగడపాటి మాట్లాడుతూ గత నెల 30న జరిగిన తెలంగాణ మార్చ్‌కు కేవలం 80 వేల మంది తెలంగాణవాదులు మాత్రమే హాజరయ్యారని, దీన్ని బట్టి మార్చ్‌ సక్సెస్‌ కాలేదని పచ్చి అబద్ధాలు మీడియా ముఖంగా బల్ల గుద్దీ మరీ చెప్పారు. కానీ, సీమాంధ్ర ఛానళ్లే మార్చ్‌కు నాలుగున్నర లక్షల మందికి పైగా వచ్చారని వార్తలు ప్రసారం చేశాయి. ఈ విషయం లగడపాటికి తెలియక ఏదేదో మాట్లాడిండు. లగడపాటి ఇలా మాట్లాడుతున్న విషయాన్ని తెలంగాణవాదుల ముందు ప్రస్తావిస్తే, ‘ఏం ఒర్రుతడో.. ఒర్రుకోని.. అతన్ని మేము పట్టించుకోవడమే మానేశాం’ అంటూ వెంట్రుకను పీకేసినట్లు తీసిపారేశారు. తెలంగాణవాదుల నికార్సయిన ఈ జవాబుతో కంగుతిన్న ‘లగడ’, గప్‌చుప్‌ అయిపోయిండు. మరి క్లాస్‌ ఫస్ట్‌ లగడపాటిని బీట్‌ చేయడానికి ‘సెకండ్‌’ ‘థర్డ్‌’ ర్యాంకర్లు ఊరుకుంటారా ? అందుకే, నిన్న ఆదివారం సెలవు దినం కావడంతో, ఏ పనీ లేక ఒకప్పటి ‘డేరా నగర్‌’.. అంటే, నేటి కర్నూల్‌లో సెకండ్‌ ర్యాంకర్‌ కళలను పోషించేందుకు తన పేరుతో కట్టుకున్న టీజీవీ కళాక్షేత్రంలో గుప్పెడు మంది సమైక్యవాదులతో ‘విశాలాంధ్ర మహాసభ’ పేరుతో ఓ సభ నిర్వహించుకున్నారు. అక్కడ జరిగింది ‘విశాలాంధ్ర మహాసభ’ కాబట్టి, కచ్చితంగా తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చేలా మాట్లాడాలి కదా ! దీంతో ‘సెకండ్‌ ర్యాంకర్‌’ టీజీ వెంకటేశ్‌ బొంగురు పోయినట్లుండే తన గొంతును సవరించుకుని మైకందుకున్నాడు. మాట్లాడడం మొదలు పెట్టాడు. మొదటి  మాటగా ఆయన ‘తెలంగాణవాదులు అధికార దాహంతోనే ప్రత్యేక రాష్ట్ర నినాదానికి తెర లేపారు’ అని సెలవిచ్చారు. కరెక్టే కదా ! సీమాంధ్ర పాలకులు రాష్ట్రాన్ని పాలిస్తూ, తెలంగాణ వనరులను దోచి, ఇక్కడి అభివృద్ధిని పట్టించుకోకుండా, సాంస్కృతిక విధ్వంసానికి పాల్పడుతున్నారని తెలుసుకున్న తెలంగాణవాదులు.. ఇక సీమాంధ్రుల దుష్ట పాలనకు చరమగీతం పాడాలని, స్వపరిపాలన కోసం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి తెర లేపారు. ఇదే విషయాన్ని టీజీ చెప్పారు. సమైక్యవాదులంతా చప్పట్లు కొట్టి హర్షం తెలిపారు ! మళ్లీ వెంకటేశ్‌ మాట్లాడుతూ ‘తెలంగాణలోనూ సమైక్యవాదులున్నారు, తెలంగాణలో ఉన్న సమస్యలన్నీ సీఎం కిరణ్‌ పరిష్కరించారు, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది’ అని కాస్త గట్టిగానే చెప్పారు. ఈ వ్యాఖ్యలను విశ్లేషిస్తే.. నిజమే తెలంగాణలోనూ కొందరు తమ స్వార్థం కోసం, టీజీలాంటి వాళ్ల మెప్పు కోసం సమైక్యవాదానికి మద్దతు తెలుపుతున్నారు. కానీ, ఈ విషయాన్ని తెలంగాణలో పుట్టిన ఎల్‌కేజీ చదివే పోరోడి ముందు చెప్పలేరు. ఎందుకంటే, వీళ్లు ఇప్పుడు జనంలో తిరగడం లేదు. తిరిగితే జనం చెప్పులు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. ఇక సీఎం కిరణ్‌ తెలంగాణ సమస్యలను పరిష్కరించింది నిజమే అయితే, ఆయన తెలంగాణలో ఏదో ఒక కార్యక్రమం సాకుతో వచ్చేవారు. కానీ, రావడం లేదు. అంటే, తాను తెలంగాణ కోసం ఏం చేస్తున్నడో సీఎంకు బాగా తెలుసు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలోకి వెళ్లి అభివృద్ధి మంత్రం జపిస్తే ఏం జరుగుతుందో కూడా తెలుసు. కాబట్టి, సీఎం తెలంగాణ గురించి తన హై సెక్యూరిటీ గదిలో నుంచో, సీమాంధ్ర ప్రాంతాల్లో పర్యటించినప్పుడే తప్ప మామూలు సమయాల్లో కూడా మాట్లాడడం లేదు. మిగిలింది థర్డ్‌ ర్యాంకర్‌  పరకాల ప్రభాకర్‌. ఈ సారు మాట్లాడుతూ ‘తెలంగాణ మార్చ్‌ తుస్సుమంది, త్వరలో తెలంగాణలోనూ విశాలాంధ్ర మహా సభలు నిర్వహిస్తాం’ అని తన కీచు గొంతులో చిలుక పలుకులు పలికారు. ఈ సారు చెప్పినట్లు తెలంగాణ మార్చ్‌ తుస్సుమంటే, ఆ రోజు నెక్లెస్‌ రోడ్డుకు వ్యాహ్యాళికి వస్తే బాగుండేది కదా ! ఎలాగో మార్చ్‌ విజయవంతం కాలేదంటున్నడు కాబట్టి కాసేపు కాలక్షేపం చేసైనా వెళ్లేవాడు. కానీ, ఆయన రాలేదు. ఎందకో ఆయనకూ తెలుసు.. మనకూ ఎలాగో తెలుసు. ఇక తెలంగాణలో విశాలాంధ్ర మహా సభల నిర్వహణ గురించి చెప్పుకుంటే, సెక్యూరిటీ మధ్యన, సీమాంధ్ర నాయకులు అండగా ఉండగా హైదరాబాద్‌లో నిర్వహించాలనుకుంటేనే ఈయనకు చుక్కలు కనబడ్డాయి. ఈ ‘సన్మానం’ చాలదన్నట్లు తెలంగాణ మొత్తం తిరుగుతాడట ! రానీ, తెలంగాణ పోరు బిడ్డలు ‘ఘన స్వాగతం’ పలికేందుకు సిద్ధమైతరు.