సమైక్య రాష్ట్రంలో ఫ్లోరైడ్‌ పరిష్కారం కాదు

తెలంగాణకు తాగునీరిచ్చాకే కృష్ణాడెల్టాకు ఇవ్వండి
కేటీఆర్‌ డిమాండ్‌

హైదరాబాద్‌, జూలై 8 (జనంసాక్షి): సమైక్య రాష్ట్రంలో నల్గొండ ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారం కాదని, తెలంగాణకు తాగునీరు అందించిన తరువాతే నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన విలే కరులతో మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా నాగార్జు నసాగర్‌ ప్రాజెక్టులో నీటి మట్టం 510 అడుగుల కన్న తక్కువగా నీరు ఉంటే కృష్ణా డెల్టాకు నీరు విడదల చేయవద్దని ఉన్నా, ఈ ప్రభుత్వం సీమాంధ్రకు న్యాయం చసేందుకు ప్రయత్నిస్తున్న దని ఆయన ఆరోపించారు. రోజూ 4 క్యూసెక్కుల నీరు కిందకు వదులుతున్నారని, దీని వల్ల జంట నగరాల ప్రజలకు కూడా తాగునీరు దొరకక ఇబ్బంది పడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. వెంటనే ప్రభుత్వం నీటి విడుదలను నిలిపివేయాలని సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆ ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. జాతీయ ఫ్లోరైడ్‌ కేంద్రాన్ని నల్లగొండలో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణకు అన్యాయం జరగలేదంటూ లగడపాటి చేస్తున్న వాదనపై ఆయన తీవ్రంగా స్పందంచారు. ఆయన ఒక జోకర్‌గా అభివర్ణించారు. కేసీఆర్‌తో చర్చించే స్థాయి లగడపాటికి లేదన్నారు. తెలంగాణ సాధన కోసం ఎంతటి స్థాయి ఉద్యమాలను నిర్వహించేందుకైనా టీఆర్‌ఎస్‌ సిద్ధంగా ఉందని ప్రకటించారు. చంద్రబాబు మాదిరిగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను గాలికి వదిలేసిన చరిత్ర తనది కాదని అన్నారు.