సులభతర రిజిస్ట్రేషన్లకు ధరణి ఒక వేదిక
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
యాదాద్రి భువనగిరి బ్యూరో జనం సాక్షి
వ్యవసాయ భూములకు పారదర్శకతతో, సులభతర రిజిస్ట్రేషన్లకు ధరణి ఒక వేదికగా నిలిచిందని జిల్లా కలెక్టరు శ్రీమతి పమేలా సత్పతి అన్నారు.
సోమవారం నాడు భారత దర్శినిలో భాగంగా ఒక వారం రోజుల పాటు శిక్షణా కార్యక్రమంలో భాగంగా మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల శాఖ, హైదరాబాదు నుండి ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ బెనహర్ మహేశ్ దత్తా ఎక్కా సూచనల మేరకు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన డిప్యూటీ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, బ్లాక్ డవలప్మెంట్ అధికారులు, డిప్యూటీ తహశీలుదార్లు గల 54 మందితో కూడిన అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారుల బృందం జిల్లా కలెక్టరును వారి ఛాంబర్లో కలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారికి జిల్లా కలెక్టరు ధరణి పోర్టల్ ద్వారా అందించబడుతున్న సేవలను పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ధరణి పోర్టల్ ద్వారా అందించబడే 33 మాడ్యూల్ సేవలను, పది సమాచార మాడ్యూల్ సేవలను వివరించారు. వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోలు, నాలాగా మార్చుకోవడం, వారసత్వ భూముల కొనుగోలు, అమ్మకాలు పారదర్శకతతో వేగవంతంగా నిర్వహించడం జరుగుతున్నదని, ఎలక్ట్రానిక్ పాస్ బుక్ మంజూరీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పట్టాదారు ప్రమేయం లేకుండా ఎలాంటి మార్పులు, చేర్పులకు అవకాశం లేదని, ఎన్.ఆర్.ఐ. లకు కూడా కొనుగోలు, అమ్మకాలు జరుపుకునే అవకాశం వుందని అన్నారు.
కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు డి.శ్రీనివాసరెడ్డి, డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ కోఆర్డినేటర్లు డాక్టర్ శ్రీనివాస్, వడ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.