స్వగృహ ఇళ్లను త్వరితగతిన అప్పగించాలి

కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌
శ్రీకాకుళం, ఆగస్టు 2 : రాజీవ్‌ స్వగృహ ఇళ్లుకు పూర్తిగా చెల్లింపులు చేసిన లబ్ధిదారులకు త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసి అప్పగించాలని జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ ఆదేశించారు. ఎచ్చెర్ల మండలం షేర్‌మహ్మద్‌పురం పంచాయతీ పరిధిలో కొండపై వంద ఎకరాల్లో నిర్మిస్తున్న ఇళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రాజీవ్‌ స్వగృహ ఇళ్లకు డబ్బులు చెల్లించిన లబ్ధిదారులు ఆయనకు తమ గోడును వినిపించారు. ఇళ్లకు వంద శాతం నిధులు చెల్లించి ఏడాది పూర్తవుతున్నా నేటికీ అప్పగించలేదని, అప్పులకు వడ్డీలు చెల్లించడంతో పాటు మరో వైపు అద్దె ఇళ్లలో ఉంటున్నామని కె.చిన్నవాడు, పి.అప్పారావు, ఎం.వి.రమేష్‌ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి దశలో 200 ఇళ్లు పూర్తి చేసేందుకు నిర్మాణం ప్రారంభించారని, ఇప్పటి వరకు ఒక్కటీ పూర్తి కాలేదని, ఎన్నాళ్లకు పూర్తవుతాయో తెలియడం లేదని వారు అసహనం వ్యక్తం చేశారు. ఏడాది నుంచి గుత్తేదారుకి ప్రభుత్వం చెల్లింపులు చేయక నిర్మాణం నిలుపుదల చేశారన్నారు. దీనిపై రాజీవ్‌ స్వగృహ జనరల్‌ మేనేజర్‌ శివాజీ మాట్లాడుతూ పరిస్థితి ప్రభుత్వానికి నివేదించామని, వీలైనంత వేగంగా ఇళ్లు పూర్తిచేసేందుకు చర్యలు చేపడతామని కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ మాట్లాడుతూ అన్ని ఇళ్లతో సంబంధం లేకుండా, ఒక వరుసలో నిర్మించిన ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి డబ్బులు చెల్లించిన వారికి తొలుత ఇవ్వాలని జనరల్‌ మేనేజర్‌కు ఆదేశించారు. వ్యక్తిగత విద్యుత్‌, తాగునీటి సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని, దీనిపై ఎప్పటి కప్పుడు నివేదిక తనకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయన వెంట తహశిల్దారు వి.శివబ్రహ్మానందం, ఆర్‌డబ్ల్యుయస్‌ జేఈ సూర శివ తదితరులు పాల్గొన్నారు.