హుఊరాబాద్ ఓటమితో కెసిఆర్లో ఫ్రస్టేషన్బీజేపీ నేత యెండల లక్ష్మినారాయణ
నిజామాబాద్,నవంబర్9జనం సాక్షి : హుజూరాబాద్ ఓటమితో కెసిఆర్లో ఫ్రస్టేషన్ కనిపిస్తోందని, అందుకే ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ మండిపడ్డారు. కెసిఆర్ బెదిరింపులకు తాము భయపడబోమని అన్నారు. కావాలనే రాష్ట్ర మంత్రులు కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. వరి కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల వద్ద సరైన ఏర్పాట్లను చేయలేదన్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేటలో రైతు వరి కుప్పపైనే చనిపోయాడని దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం నుంచి 94లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేసిందన్నారు. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే మార్క్ఫెడ్ ద్వారా ఈ మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో టీఆర్ఎస్ నేతలు కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నా రు. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించడంలేదని ఆయన ప్రశ్నించారు. ఈ ధరల తగ్గింపుపై టీఆర్ఎస్ నేతలను నిలదీస్తామన్నారు.