అణు జవాబుదారీ చట్టం సవరించం
కేంద్రం స్పష్టీకరణ
అమెరికాతో కుదిరిన అవగాహన ఇదే
దిల్లీ,ఫిబ్రవరి8(జనంసాక్షి): అణు జవాబుదారీ చట్టాన్ని సవరించేదిలేదని కేంద్ర ప్రభుత్వం ఆదివారం స్పష్టంచేసింది. అణు ఒప్పందానికి సంబంధించి ఇటీవల అమెరికాతో కుదిరిన అవగాహనను తాజాగా విడుదల చేసింది. అణు ప్రమాదం జరిగితే బాధితులు.. అణు రియాక్టర్లకు పరికరాలను సరఫరా చేసిన విదేశీ కంపెనీలపై దావా వేయజాలరని ఇది స్పష్టం చేస్తోంది. జవాబుదారీతనం, పరిహారం, నష్టాల నుంచి ఆపరేటర్ ఉపశమనం పొందే హక్కు వంటి వివాదాస్పద అంశాలకు సంబంధించి సవివర పత్రాన్ని విదేశాంగ శాఖ విడుదల చేసింది. పౌర అణుజవాబుదారీ చట్టం (సీఎల్‌ఎన్‌డీఏ)లో సవరణలు చేసే ప్రతిపాదనేదీ లేదని పేర్కొంది. అణు ప్రమాదం జరిగినప్పుడు బాధితులు.. విదేశీ సరఫరాదారులపై వ్యాజ్యం వేయజాలరని తెలిపింది. అయితే ఆ సరఫరాదారులను ఆపరేటర్ మాత్రమే జవాబుదారు చేయగలడని వివరించింది. ఆపరేటర్‌కు నష్టాల నుంచి ఉపశమనం పొందే హక్కు ఉందని తెలిపింది. దీన్ని ఆపరేటర్, సరఫరాదారు.. ఒక కాంట్రాక్టు ద్వారా దీన్ని అమల్లోకి తెచ్చుకోవాలని వివరించింది.
భారత్ – అమెరికా అణు సంప్రదింపుల బృందం మధ్య మూడు విడతల చర్చల తర్వాత విధానపరమైన అవరోధాలపై అవగాహన కుదిరినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. ”ఈ చర్చల ఆధారంగా పౌర అణుసహకారానికి సంబంధించి దీర్ఘకాలంగా నలుగుతున్న రెండు అంశాలపై అవగాహన కుదిరింది. దీన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాలు గత నెల 25న నిర్ధరించారు” అని పేర్కొంది. అణు ప్రమాదానికి సంబంధించిన నష్టం బాధ్యత పూర్తిగా ఆపరేటర్‌దేనని సీఎల్‌ఎన్‌డీ చట్టం చెబుతోందని వివరించింది. ఇతర చట్టాల కింద చర్యలకు వీలు కల్పించే సెక్షన్ 46 విస్తృతిపై స్వదేశీ, విదేశీ సరఫరాదారుల నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయని తెలిపింది. అయితే ఇతర చట్టాల కింద అణు ప్రమాద పరిహారానికి క్లెయిములు దాఖలు చేయడానికి ఈ సెక్షన్ ప్రాతిపదిక కాబోదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇదే విషయంపై హామీ ఇస్తూ శుక్రవారం భారత్.. అమెరికాకు ఒక మెమోరాండం అందజేసింది.
మరోపక్క అణు పదార్థాలపై కదలికలపై పరిశీలనకు సంబంధించి అమెరికాకు ద్వైపాక్షిక రక్షణలు ఇచ్చే నిబంధన ఉందన్న వాదనను విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ అక్బరుద్దీన్ ఖండించారు. అంతర్జాతీయ న్యాయ నిబంధనలకు అనుగుణంగా తమ విధానాలు ఉంటాయని చెప్పారు.
సీఎల్‌ఎన్‌డీ బిల్లు.. పార్లమెంటులో చర్చల తర్వాత ఆమోదం పొందిందని మంత్రిత్వశాఖ పేర్కొంది. ”బిల్లులోని వివిధ అంశాలపై ఓటింగ్ సమయంలో రాజ్యసభలో.. క్లాజ్-46 కింద రెండు సవరణలను ప్రతిపాదించారు. సరఫరాదారులను కూడా దీని పరిధిలోకి తీసుకురావాలన్నది కూడా ఇందులో ఉంది. అయితే రెండు సవరణలనూ కొట్టేశారు. చట్టం నుంచి తొలగించిన నిబంధనను.. అందులో ఉన్నట్లుగా భాష్యం చెప్పరాదు” అని తెలిపింది. అదే సమయంలో విదేశీ న్యాయస్థానాలను ఆశ్రయించడానికి బాధితులకు అది ప్రాతిపదిక కాకూడదని వివరించింది. విదేశీ కోర్టుల జ్యూరిస్‌డిక్షన్‌ను ప్రవేశపెట్టే నిర్దిష్ట సవరణను కూడా బిల్లు ఆమోదం సమయంలో తిరస్కరించినట్లు తెలిపింది.
విదేశీ సరఫరాదారుల నుంచి ఉపశమనాన్ని కోరే హక్కు అపరేటర్‌కు లేదన్న వాదనను మంత్రిత్వశాఖ తోసిపుచ్చింది. సీఎల్‌ఎన్‌డీలోని సెక్షన్ 17 కింద ఆ హక్కు ఉందని పేర్కొంది. ”అది అపరేటర్‌కు సంబంధించిన హక్కు. అయితే అది తప్పనిసరి కాదు. వీలుకల్పించే నిబంధన మాత్రమే. రిస్కును పంచుకునే వ్యవస్థపై ఆపరేటర్, సరఫరాదారు మధ్య కుదిరే కాంట్రాక్టులో దీన్ని చొప్పించవచ్చు” అని వివరించింది.