అది హత్య కాదు.. ప్రమాదమే: సీపీ యోగానంద్

– లావణ్యది హత్య కాదని స్పష్టం చేసిన అధికారులు
విశాఖపట్నం

ఈ నెల 22న అనకాపల్లి సమీపంలో వివాహిత లావణ్య రోడ్డు ప్రమాదం కారణంగానే మృతి చెందిందని, ఆమెది హత్య కాదని విశాఖ పోలీసు కమిషనర్ యోగానంద్ స్పష్టం చేశారు. లావణ్య మృతి కేసుకు సంబంధించి దర్యాప్తు వివరాలను కమిషనరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కమిషనర్ యోగానంద్ వెల్లడించారు.

ఈనెల  22న సాయంత్రం లావణ్య, తన ఆడపడచు దివ్య, మోహన్‌కుమార్‌తో కలసి అనకాపల్లిలోని నూకాంబికా ఆలయం నుంచి పల్సర్ బైక్‌పై బయల్దేరి కొంతదూరంలో ఉన్న జాతీయ రహదారిపైకి వచ్చారు. అదే సమయంలో దాడి హేమకుమార్, బొడ్డేడ హేమంత్‌లు కారులో అటువైపు వస్తున్నారు. వారిద్దరూ మద్యం మత్తులో ఉండగా హేమకుమార్ కారు నడుపుతూ పల్సర్ బైక్‌ను ఢీకొట్టాడు.

దీంతో దివ్య ఒకవైపుకు పడిపోగా లావణ్య కారు బానెట్‌పై పడిపోయింది. వారు మద్యం మత్తులో ఉండడంతో బ్రేక్ వేయకుండా అలానే 75 మీటర్ల మేర ముందుకు పోనిచ్చారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో లావణ్య అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత హేమకుమార్, హేమంత్ ఇద్దరూ పరారయ్యారు. వారిని సోమవారం అరెస్ట్ చేసినట్టు సీపీ తెలిపారు. లావణ్యను కారుతో గుద్ది దారుణంగా హత్య చేశారంటూ మీడియాలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.

తాజావార్తలు