అధికారులకు రైతులు సహకరించాలి

ఖమ్మం,మే8(జ‌నం సాక్షి): రైతుల వ్యవసాయ సాగుకు ఎకరానికి రూ.4వేల చొప్పున ఉచితంగా పెట్టుబడిని అందించే సదుద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుపరచనున్న రైతుబంధు పథకం చెక్కుల పంపిణీని ఈనెల 10వ తేదీ నుంచి పారదర్శకంగా నిర్వహించనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ఏ రైతుకు మంజూరైన చెక్కును ఆ రైతుకే ఇవ్వడం జరుగుతుందని అన్నారు. చెక్కుతో పాటు ఒక స్లిప్‌లో చెక్కు పొందిన రైతు బ్యాంక్‌కు వెళ్లే తేదీని కూడా ఖరారు చేసి ఇస్తామని తెలిపారు. సదరు రైతు స్లిప్‌లో ఉన్న తేదీన మాత్రమే బ్యాంక్‌కు వెళ్లి చెక్కును మార్చుకోవాలని అన్నారు. రైతులందరూ గ్రామాల్లోకి వచ్చిన వ్యవసాయశాఖ సిబ్బందికి సహరించాలని కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు రైతులకు పంపిణీ చేయుటకు సిద్ధంగా ఉన్నాయని  తెలిపారు. రైతు సమన్వయ సమితుల సభ్యుల సహకరాంతో వీటిని సజావుగా పంపిణీకి ఏర్పాట్లు చేశామని అన్నారు.