అప్పుడో మాట.. ఇప్పుడోమాట
అది వైఎస్‌ఆర్ సిపికే చెల్లు : టిడిపి
కడప, జూలై 19: జగన్మోహన్‌రెడ్డి బెయిల్ కోసం వైఎస్‌ఆర్ సిపి నాయకులు సోనియాగాంధీ కాళ్లపై పడ్డారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడి ఆ పార్టీ నీచరాజకీయాలకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలపై నాలుగురోజులుగా తెలుగుదేశం నాయకులు ఆందోళన చేస్తున్నా ముఖ్యమంత్రిలో ఏమాత్రం చలనం లేదని దుయ్యబట్టారు. జిల్లాలోని రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, సిమెంట్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం నాయకులు కలెక్టరేట్ వద్ద నాలుగు రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు పార్లమెంట్ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు, ఆ పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు, కిష్టప్ప గురువారం కడపకు వచ్చారు. దీక్షలో ఉన్న ప్రజాప్రతినిధులను పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడారు. అవినీతి అక్రమాల కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్మోహన్‌రెడ్డిని బెయిల్‌పై బయటకు రప్పించుకునేందుకు కాంగ్రెస్ పార్టీతో వైఎస్‌ఆర్ సిపి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. ఆ క్రమంలోనే రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని ఆ పార్టీ నిర్ణయించిందని అన్నారు. ప్రజలను అన్ని రకాలుగా ఆ పార్టీ మోసం చేస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని వారు విమర్శించారు. జిల్లాలో అనేక రాయితీలు పొందిన సిమెంట్ ప్యాక్టరీల యాజమాన్యం జిల్లా ప్రజలకు సిమెంట్ బస్తాను 330కి అమ్ముతుండగా రాజధానిలో 270కే అమ్ముతున్నారని వివరించారు. ఈ అంశంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదని వారు నిలదీశారు. వాస్తవానికి ప్రజలను మోసం చేసి సంపాదించిన డబ్బులతో జగన్మోహన్‌రెడ్డి కూడా ఒక సిమెంట్ ప్యాక్టరీ పెట్టారని ఆయన కూడా ఇదే పంథాలో వెళ్తున్నారని, ఆయన ప్రజల కోసం ఏం చేశారని వారు నిలదీశారు. గతంలో టిడిపి హయాంలో సిమెంట్ ప్యాక్టరీల యాజమాన్యాలు కుమ్మక్కై సిమెంట్ ధరలను పెంచాయని, ఆ సమయంలో చంద్రబాబు యాజమాన్యాలకు అన్ని విధాలుగా హెచ్చరికలు జారీ చేసి ధరలను నియంత్రించారని గుర్తుకు తెచ్చారు. ఇక విద్యుత్ విషయానికి వస్తే రాష్ట్రం అంధకారంలో ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వారు ఆరోపించారు. ముఖ్యమంత్రి ఈ శాఖను తన ఆధీనంలో ఉంచుకున్నప్పటికీ పర్యవేక్షణ, సమీక్షలు లోపం కారణంగా రాష్ట్ర ప్రజలకు ఈ దుస్థితి ఏర్పడిందని చెప్పారు. ఈ దీక్షా శిబిరం వద్ద చిత్తూరు జిల్లా టిడిపి నాయకుడు దొరబాబు, జిల్లా తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.