” అరకొర వసతులు… ఆటస్థలాల కరువు… ఆనక సర్కారు బడులు తాగుబోతుల అడ్డాలు – బిజెపి నేత గజ్జల యోగానంద్”
మియాపూర్ , సెప్టెంబర్ 19( జనంసాక్షి): రాష్ట్రంలో తెరాస పాలనలో సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదని, ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడ చూసినా వసతుల కరువు, ఆటస్థలాల కొరత ఏర్పడి సరైన పర్యవేక్షణ లేకపోవడంవల్ల సాయంత్రం అయ్యిందంటే మందుబాబులకు, తాగుబోతులకు అడ్డాగా మారుతున్నాయని, తెరాస పాలనావ్యవస్థలో ప్రభుత్వ విద్యకు ఎంతటి దుస్థితి చేకూరిందని భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత, శేరిలింగంపల్లి అసెంబ్లీ బిజెపి ఇన్చార్జ్ గజ్జల యోగానంద్ ఆరోపించారు. ఈమేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్పేట్ డివిజన్ పరిధి ఓల్డ్ హఫీజ్పేట్, గంగారం విలేజ్, శాంతినగర్ లో నెలకొనివున్న ప్రభుత్వ పాఠశాలలను, అంగన్వాడీ కేంద్రాలను సోమవారం స్థానిక బిజెపి నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ నెలకొన్న దుస్థితినిచూసి గజ్జల తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. తెరాస పాలనలో ప్రభుత్వ విద్య కార్పొరేట్ స్కూళ్లకి, ప్రభుత్వ వైద్యం కార్పొరేట్ హాస్పిటల్స్ కి దారాదత్తమయ్యాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడ మౌలికసౌకర్యాల పరిస్థితిలేదని, నూటికి 90 పాఠశాలల్లో విద్యార్థులకు సరైన మూత్రశాలలు లేవంటే ఎంతటి దయనీయ పరిస్థితి నెలకొందో ఊహించవచ్చన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చిన ఘనత గులాబీ దండుకు దక్కుతుందని, చివరకు ఆ తాగుబోతులకు ప్రభుత్వ పాఠశాలలు నెలవయ్యే దారుణపరిస్థితి నెలకొందన్నారు. ఓల్డ్ హఫీజ్పేట్ లోని ప్రభుత్వ పాఠశాల మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉందని, దీనికితోడు పాఠశాలకు ప్రహరీకూడా లేకపోవడంతో స్థానికులకు వెహికల్ పార్కింగ్ అడ్డా, సాయంత్రానికి తాగుబోతులకు అడ్డాగా మారిందని యోగానంద్ దుయ్యబట్టారు. దేశ భవిష్యత్తు తరగతి నాలుగోడల మధ్యలో నిర్మితమవుతుందని ఆనాటి మహనీయులు చెప్పిన మాట గులాబీ దండు పాలనలో తాగుబోతుల అసాంఘిక కార్యకలాపాలు పాఠశాల తరగతి ఆవరణలో అదేవిధంగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కు ఏ మాత్రం చిత్తశుద్ధివున్నా తక్షణమే నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీ గోడలను నిర్మించి వసతుల కల్పనతోపాటు పోలీసుల పహారాను కొనసాగించాలని గజ్జల సూచించారు. ఈకార్యక్రమంలో నాయకుల రవి గౌడ్, మహేష్ యాదవ్, వరప్రసాద్, అశోక్ నాయి, వెంకటరమణయ్య, నవీన్ కుమార్, జగన్ గౌడ్, నందకుమార్, దేవల్ యాదవ్, పవన్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు.