అవతరణ ఉత్సవాలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు

భద్రాద్రి కొత్తగూడెం,మే10(జ‌నం సాక్షి): రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. మరో 20 రోజులుల మాత్రమే సమయం ఉండడం, ఈ వారం పాటు రైతుబందు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉండడంతో అధికారులు జాగ్రత్త పడుతున్నారు. అవతరణ కోసం, భద్రాద్రి కొత్తగూడెంను సుంద‌రంగా అలంకరివంచనున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుద్దీకరణ చేయనున్నారు.  పట్టణంలోని ప్రధాన కూడళ్లను విద్యుద్దీకరణ చేయాలని మున్సిపల్‌ అధికారులకు సూచించారు. ప్రగతి మైదానాన్ని అందంగా ముస్తాబు చేయాయించాలని, కార్యక్రమాలను వీక్షించడానికి వచ్చే ప్రజలకు సురక్షిత తాగునీరు ఏర్పాటు చేయాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులకు అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు స్పష్టం చేశారు. ఇందకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణపై జిల్లా అధికారులతో ఇప్పటికే కలెక్టర్‌ మాట్లాడారు. శాఖల వారీగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతి నివేదికల వివరాలను ఈనెల 20వ తేదీలోగా డీపీఆర్‌వోకు అందజేయాలని అన్నారు. కార్యక్రమాల నిర్వహణకు శాఖాపరంగా చేపట్టాల్సిన పనుల గురించి అధికారులకు సూచనలు చేశారు. రాష్ట్ర అవతరణ రోజున ఉదయం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అధికారులు ప్రగతి మైదానానికి చేరుకోవాలన్నారు. ఉదయం ఎనిమిది గంటలకు బస్టాండ్‌ సెంటర్‌లోని అమరవీరుల స్థూపానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి గౌరవ అతిథి పూలమాలలు వేసి అనంతరం ప్రగతి మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని, ఆ తరువాత జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని తెలిపారు.