ఆధ్యాత్మికం
ధర్మాచరణ అన్నది ముఖ్యం
హైదరాబాద్,జూలై6(జనం సాక్షి): ఉన్నతిని ఏ రకంగా కోరుకోవాలి అంటే ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నతిని కోరుకోవచ్చు. అయితే ధర్మం అంటే ఏమిటి అనేవే మనకు కలిగే ప్రశ్నలు. ధరతి ఇతి ధర్మః,ధారయతి ఇతి ధర్మః, అని ధాతువులనుండి ధర్మం అనే శబ్దం ఏర్పండింది. మనం చేస్తే అది ఆచరించబడుతుంది కనుక దానికి ధర్మం అనిపేరు. మంచి ఆచరణ అని అర్థం. అంటే ప్రశాంతతకోసం మనం చేసుకొనే సాధన. మన పోషణ కోసం, మన కుటుంబ పోశణ కోసం, మన సమాజ పోషణ చేసుకొనే పనులు. ఆ పనులు చేస్తు కొంత ఆర్జించటం, ఆ ఆర్జించిన దాన్ని ఎంత అవసరమో అంత అనుభవించటం. ఆ మిగిలిన దాన్ని తన తోటి వ్యక్తులకి సమాజానికి పంచి ఉపకారకంగా తాను ఉండటం. ఆ చేసే పనులు ఒకరిని హింసిచకుండా చేసేవిగా ఉండాలి కనుక వాటిని మంచి పనులని అంటారు. ఇవి మనం సామాన్యంగా చేసే పనులు. అలా అభ్యసిస్తూ మనల్ని మనం నిలబెట్టుకోవడానికి చేసే మనులని ధర్మం అంటారు. మనం ఒక వాహనాన్ని నడపాలి అంటే మొదట కష్టపడి అభ్యసిస్తాం, క్రమేనా పెద్దగా కష్టపడకుండానే అదే మనల్ని సులువుగా గమ్య స్థానానికి చేర్చుతుంది. అంటే మొదట చేసినది ‘ధరతి’ అంటె మనం చేసిన ప్రయత్నం, తరువాత
దానంతట అదే మనల్ని కాపాడేది ‘ధారయతి’ , దీన్నే ధర్మం అంటారు. ఒక గదిని చీకటిమయం చెయ్యాలనుకుంటే, నేరుగా ఆ గదిలోకి చీకటిని తీసుకురాలేం. మరెలా ఆ పని చెయ్యడం? దానికి ఒక్కటే మార్గముంది. అదేమంటే, ఆ గదిలోని వెలుగును తొలగించడమే. అప్పుడే అందులోకి చీకటి చొరబడుతుంది. ఒకవేళ వెలుగు తీసుకువస్తే అందులోంచి చీకటి వెళ్లిపోతుంది. ఆ రీతిన వెలుగు చెప్పినట్లు చీకటి వింటుంది. అంతేగానీ చీకటి చెప్పినట్లు వెలుగు వినదు. ఎందుకంటే, వెలుగు యజమాని లాంటిది. దానికి సొంత ఉనికి ఉంది. చీకటి పరాధీనమైంది. దీపం చిన్నదే కావచ్చుగాని అది రాగానే విస్తారంగా పరచుకున్న చీకటి పారిపోతుంది. వెలుతురుకు అంతటి శక్తి ఉంది. అందుకనే జ్ఞానాన్ని వెలుగుతో, అజ్ఞానాన్ని చీకటితో పోలుస్తారు. చీకటి పిరికిది. దానికి భయం ఎక్కువ. అందువల్లే అది వెలుతురుకు ఎదురుపడి ధైర్యంగా నిలబడలేదు. అది ఎప్పుడూ ఏదో ఒకదాన్ని అడ్డుపెట్టుకొని వెలుతురుకు వ్యతిరేక దిశలో చాటుగా దాక్కుంటుంది. ధర్మాచరణ వల్ల చీకటి లాంటి అధర్మాన్ని తొలగించుకునే వీలుంటుంది.
————